తెలుగు పాటకు వెలుగుబాటలు చూపిన వారెందరో! వారిలో ప్రజాకవులది ప్రధాన పాత్ర. సుద్దాల హనుమంతు పాట తెలుగునేలను పులకింప చేసింది. ప్రజాకవిగా ఆయన సాగిన తీరును ఈ నాటికీ గుర్తు చేసుకొనేవారెందరో! హనుమంతు తనయుడు అశోక్ తేజ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక చిత్రసీమలోనూ తనదైన పంథాలో పయనిస్తూ పదనిసలకు తగ్గ పదాలను, సరిగమలకు సరితూగే సమాసాలను పొందుపరుస్తూ సాగుతున్నారు. శ్రీశ్రీ, వేటూరి తరువాత జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయితగా నిలచిన తెలుగు సినిమా కవి సుద్దాల అశోక్ తేజ! ‘నేను సైతం…’ అంటూ శ్రీశ్రీ పల్లవించిన తీరునే అనుసరిస్తూ ‘ఠాగూర్’ సినిమా కోసం సుద్దాల అల్లిన పదబంధాలు ఆయనకు ఉత్తమ గీత రచయితగా నేషనల్ అవార్డును సంపాదించి పెట్టాయి. ఈ నాటికీ చిత్రసీమలో ‘నేను సైతం…’ అంటూ తనదైన బాణీ పలికిస్తున్నారు సుద్దాల అశోక్ తేజ.
సుద్దాల హనుమంతు, జానకమ్మ దంపతులకు 1959 మే 16న అశోక్ తేజ జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నచందాన హనుమంతు కడుపున పుట్టిన అశోక్ తేజకు కూడా చిన్నతనంలోనే కవిత్వం అబ్బింది. బాల్యంలోనే పాటలు రాస్తూ వాటిని రాగయుక్తంగా పాడుతూ తిరిగేవాడు అశోక్. తరువాత మాతృభాషలో పట్టుసాధించి, పంతులుగా వృత్తి సాగించారు. మెట్ పల్లిలో సుద్దాల అశోక్ తేజ టీచర్ గా పనిచేశారు. సుద్దాల అశోక్ తేజ సోదరి తనయుడు ప్రముఖ నటుడు ఉత్తేజ్. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో ఉత్తేజ్ నటునిగా మంచి గుర్తింపు సంపాదించారు. అదే తీరున ఉత్తేజ్ కు దర్శకుడు కృష్ణవంశీతోనూ మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో తన మేనమామలోని కవిని కృష్ణవంశీకి పరిచయం చేశారు ఉత్తేజ్. కృష్ణవంశీ అశోక్ తేజను ప్రోత్సహించారు. తరువాత దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి సీనియర్ డైరెక్టర్స్ సైతం అశోక్ తేజకు అవకాశాలు కల్పించారు.
తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ అశోక్ తేజ వినియోగించుకున్నారు. తనదైన పదాలతో పాటలు పలికించారు. ఈ మధ్యకాలంలో ‘ట్రిపుల్ ఆర్’లో సుద్దాల అశోక్ తేజ రాసిన “కొమురం భీముడో…” పాట విపరీతమైన ఆదరణ పొందింది. అందులో ఆ నాటి తెలంగాణ పదాలను చొప్పించిన తీరును చూసి, ఎంతోమంది సాహితీప్రియులు సుద్దాల అశోక్ తేజకు జేజేలు పలికారు. దాసరి దర్శకత్వంలో రూపొందిన “కంటే కూతుర్నే కను, మేస్త్రి” చిత్రాల ద్వారా ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు అందుకున్నారు సుద్దాల అశోక్ తేజ. ఇక చిరంజీవి ‘ఠాగూర్’లో “నేను సైతం…” అంటూ సాగే పాటతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా నిలిచారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే తెలిసిన సుద్దాల అశోక్ తేజ, ఇప్పటికీ తన చెంతకు చేరిన అవకాశానికి తగ్గ పదాలను అందించాలనే తపిస్తూ ఉంటారు.