విజయ్ దేవరకొండ సినిమాలన్నాక.. కనీసం ఒక్క ముద్దు సన్నివేశం లేదా రొమాంటిక్ సీన్ ఉండాల్సిందే! ‘అర్జున్ రెడ్డి’ నుంచి విజయ్ ఈ రొమాంటిక్ ‘దండయాత్ర’ను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు సమంతతో చేస్తోన్న ‘ఖుషీ’ చిత్రంలోనూ అలాంటి సీన్లు ఉండనున్నాయని సమాచారం. అది కూడా కేవలం ఒకటో, రెండో కాదు.. చాలా ఇంటిమేట్ సీన్లు ఉంటాయట! ముఖ్యంగా.. వీరి మధ్య ఒక ఇంటెన్స్ లిప్‌లాక్ సీన్ కూడా ఉండనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదో పూర్తిస్థాయి రొమాంటిక్ సినిమా కావడం వల్ల.. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు దర్శకుడు శివ నిర్వాణ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు బాగానే పెట్టాడని అంటున్నారు.
కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ కశ్మీరీ ముస్లిం అబ్బాయిగా నటిస్తుండగా, సమంత కశ్మీరీ పండిట్ అమ్మాయి పాత్ర పోషిస్తోంది. ఈ పాత్రల్ని బట్టే, సబ్జెక్ట్ ఏంటో దాదాపు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సబ్జెక్టులు నార్త్‌లో వివాదాలకు దారి తీస్తాయి. అందుకే.. హిందీలో మినహాయించి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా.. ‘లైగర్’ సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తోన్న విజయ్, పూరీ డైరెక్షన్‌లోనే ‘జన గణ మన’ సినిమా చేస్తున్నాడు. అటు.. సమంత శాకుంతలం, యశోద రిలీజ్ కోసం వేచి చూస్తోంది. ఇతర ప్రాజెక్టులతోనూ ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది.