తమిళ సంగీతదర్శకులు తెలుగువారిని విశేషంగా అలరించారు. వారిలో ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్థానం ప్రత్యేకమైనది. నటనలో రాణించాలని సినిమా రంగంలో అడుగుపెట్టిన ఎమ్.ఎస్.విశ్వనాథన్ కు చిన్నతనంలో నేర్చిన సంగీతమే అన్నం పెట్టింది. ఆ తరువాత విశ్వనాథన్ స్వరకల్పన సంగీతప్రియులను విశేషంగా అలరించింది. మిత్రుడు రామ్మూర్తితో కలసి బాణీలు కట్టినా, సోలోగా సంగీతం సమకూర్చినా ఎమ్మెస్ విశ్వనాథన్ స్వరకల్పనలో ప్రత్యేకతను చాటుకున్నారు. మెలోడీ కింగ్ గా పేరొందిన ఎమ్మెస్ విశ్వనాథన్ ను తమిళులు అభిమానంతో ‘మెల్లిసై మన్నార్’ అని పిలుచుకుంటారు. ఎమ్మెస్వీని ‘తిరై ఇసై చక్రవర్తి’ అని ఆ నాటి ముఖ్యమంత్రి జయలలిత సన్మానించి, అరవై బంగారు నాణ్యాలు బహూకరించారు. మిత్రుడు రామ్మూర్తితో కలసి వందకు పైగా చిత్రాలకు స్వరకల్పన చేసిన ఎమ్మెస్వీ, సోలోగా ఏడు వందల పై చిలుకు సినిమాలకు బాణీలు కట్టారు. ఆయన స్వరవిన్యాసాలకు పులకించి పోయారు ఎందరో సంగీతాభిమానులు. ఇక తెలుగునాట సైతం ఎమ్మెస్వీ బాణీలు విశేషాదరణ చూరగొన్నాయి.
ఎమ్మెస్ విశ్వనాథన్ మాతృభాష మళయాళం. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని పాలక్కాడ్ లో జన్మించారాయన. ఎమ్మెస్వీకి సంగీతంపై అభిలాష కలగడమే విచిత్రంగా సాగింది. నాలుగేళ్శ వయసులోనే విశ్వనాథన్ తండ్రిని కోల్పోయారు. దాంతో జైలర్ గా పనిచేస్తున్న మేనమామ పంచన చేరారు. థియేటర్ లో బఠాణీలు అమ్ముతూ, సినిమా పాటలు వింటూ సంగీతంపై అభిమానం పెంచుకున్నారు. ‘కణ్ణగి’ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించారు. పాఠశాలలో చదువుకొనే రోజుల్లో ఇంటికి పోతూ, రోజూ నీలకంఠ భాగవతార్ అనే ఆయన తన విద్యార్థులకు సంగీతం బోధిస్తూంటే చక్కగా వినేవారు ఎమ్మెస్వీ. కొద్ది రోజులకే హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు. రాగయుక్తంగా పాడుతూ, అందుకు తగ్గట్టుగా హార్మోనియం వాయిస్తూ ఉంటే నీలకంఠ భాగవతార్ చూశారు. ఎమ్మెస్వీలో అద్భుతమైన కళకారుడు ఉన్నాడని గుర్తించి, 13వ యేటనే మూడు గంటల పాటు హార్మోనియం వాయిస్తూ విశ్వనాథన్ పాటలు పాడేలా ఏర్పాటు చేశారు భాగవతార్. తరువాత మద్రాసు చేరి జూపిటర్ సంస్థలో ఆఫీస్ బోయ్ గా పనిచేశారు ఎమ్మెస్వీ. తొలుత ఎస్.ఎమ్.సుబ్బయ్యనాయుడు వద్ద శిష్యరికం చేసి, తరువాత సి.ఆర్.సుబ్బురామన్ దగ్గర హార్మోనియం ప్లేయర్ గా చేరారు.
సుబ్బురామన్ దగ్గరే టి.కె.రామ్మూర్తితో పరిచయం ఏర్పడింది. సి.ఆర్.సుబ్బురామన్ స్వరకల్పన చేసిన “రత్నమాల, లైలా-మజ్ను, చండీరాణి” చిత్రాలకు విశ్వనాథన్-రామ్మూర్తి ఇద్దరూ సహాయకులుగా పనిచేశారు. ‘దేవదాస్’ లోని అన్ని పాటలకూ స్వరకల్పన చేసిన సుబ్బురామన్ హఠాన్మరణంతో అందులోని “జగమే మాయ… బ్రతుకే మాయ…” పాటకు విశ్వనాథన్-రామ్మూర్తి బాణీలు కట్టడం విశేషం. ఆ తరువాత విశ్వనాథన్ – రామ్మూర్తి సంగీత ద్వయం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో జైత్రయాత్ర చేసింది. ఆ నాటి ప్రముఖ గాయనీగాయకులతో మొట్టమొదటిసారి లైవ్ పెర్ ఫామెన్స్ ఇచ్చిన ఘనత విశ్వనాథన్- రామ్మూర్తి ద్వయానిదే! ఆ ట్రెండ్ ను ఉత్తర దక్షిణ సంగీత దర్శకులెందరో అనుసరించడం విశేషం. యన్టీఆర్ నటించిన ‘సంతోషం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘ఇంటికి దీపం ఇల్లాలే’, ‘మంచి-చెడు’, ‘ఆడబ్రతుకు’, ‘కర్ణ’ వంటి చిత్రాలకు విశ్వనాథన్- రామ్మూర్తి సమకూర్చిన సంగీతం తెలుగువారిని విశేషంగా అలరించింది. నూరు చిత్రాలకు కలసి సంగీతం సమకూర్చిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల విశ్వనాథన్, రామ్మూర్తి విడిపోయారు.
ఎమ్మెస్వీ సోలోగానూ అనేక మ్యూజికల్ హిట్స్ అందించారు. వాటిలో “లేతమనసులు, మనసే మందిరం, భలే కోడలు, సత్తెకాలపు సత్తెయ్య, సిపాయి చిన్నయ్య, అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది, మరో చరిత్ర, సింహబలుడు, అందమైన అనుభవం, ఇదికథ కాదు, గుప్పెడు మనసు” వంటివి చోటు చేసుకున్నాయి. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘సమ్రాట్ అశోక’కు కూడా ఎమ్మెస్వీ స్వరకల్పన చేయడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలకు సంగీతం సమకూర్చి అలరించిన ఎమ్మెస్వీ నిజజీవితంలో ఎంతో సౌమ్యుడు. తన దరికి చేరిన వారికి ఆశ్రయం కల్పిస్తూ వచ్చారు. విశ్వనాథన్ బాణీలతోనే ఎల్.ఆర్.ఈశ్వరి ఎంతో పేరు సంపాదించారు. పలువురు గీత రచయితలకు కూడా ఎమ్మెస్వీ బాణీలే వారి ఉనికిని చాటాయి. తన గురువు ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు కష్టాల్లో ఉన్న సమయంలో వారి కుటుంబ బాగోగులు ఎమ్మెస్వీ చూసుకున్నారు. అలాగే తన మిత్రుడు చంద్రబాబు కష్ట సమయంలో ఆదుకున్నారు. ఇలా ఎంతోమందికి చేతనైన సాయం అందించిన ఎమ్మెస్వీ తన మిత్రుడు రామ్మూర్తికి తానే మళ్ళీ స్నేహ హస్తం అందించారు. చివరలో ఇద్దరూ మళ్ళీ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. స్వరకల్పనతోనే కాదు తన గానమాధుర్యంతోనూ విశ్వనాథన్ అలరించారు. ఎమ్మెస్వీ నటుడు కావాలన్న అభిలాషను గమనించిన కొందరు ఆయనకు తగిన పాత్రలను కల్పించారు. ఎమ్మెస్వీ కీర్తి కిరీటంలో ఎన్నెన్నో ఆణిముత్యాలు నిలిచాయి. భౌతికంగా విశ్వనాథన్ లేకపోయినా, ఆయన సంగీతం మనలను సదా ఆనందింప చేస్తూనే ఉంటుంది. ఆయనే స్వరపరచినట్టు, “ఏ తీగె పువ్వునో… ఏ కొమ్మ తేటినో…కలిపింది ఏ వింత అనుబంధమౌనో…” మళయాళ కుటుంబంలో పుట్టి, తమిళ చిత్రసీమలో రాణించి, తెలుగువారినీ విశేషంగా మురిపించారు ఎమ్మెస్వీ. అవును ‘ఏ నాటిదో ఈ సంగీతబంధం’. తలచిన ప్రతీసారి పులకింప చేస్తూనే ఉంటుంది.