సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో హిట్ అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఈ కాంబో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం మహేష్- త్రివిక్రమ్ రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమా గురించిన ఒక వార్త గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో మహేష్ తో పాటు ఇంకో స్టార్ హీరో కూడా కనిపించబోతున్నాడట.
ఇప్పటికే ఆ హీరో కోసం మేకర్స్ వెతుకులాట ప్రారంభించారట. అంతేకాకుండా గెస్ట్ రోల్ లో మరో హీరో కూడా కనిపించే అవకాశం కూడా ఉందట. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని అని అంటున్నారు. పాత్రకు ఉన్న ప్రాధాన్యత ప్రకారం నాని అయితే బావుంటుంది అని త్రివిక్రమ్ భావించినట్లు సమాచారం. ఇక మలయాళ స్టార్లను కూడా ఇందులో కనిపిస్తున్నట్లు వినికిడి. ఇక ఈ వార్త విన్న అభిమానులు త్రివిక్రమ్.. మహేష్ తో సినిమా తీస్తున్నాడా ..? మల్టీస్టారర్ తీస్తున్నాడా..? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన రావాల్సిందే .