లతా మంగేష్కర్ తండ్రి దీనానాధ్ కొంతకాలం భోగభాగ్యాలను అనుభవించినా అంత్యదశలో దుర్భర జీవితాన్ని గడిపారు. ఆయన కన్నుమూసే సమయానికి లతకు 13 సంవత్సరాల వయసు. జీవిత చరమాంకంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆస్తిగా ఏమీ ఇవ్వలేకపోయారు. అయితే మరణం సంభవిస్తున్న వేళ లతను దగ్గరకు పిలిపించుకుని తన తంబూరా, స్వయంగా నొటేషన్లు రాసుకున్న పాటల పుస్తకం ఇచ్చారు. ‘ఇవి నీ దగ్గర ఉండగా నన్ను మించిన ఆర్టిస్టువు కాగలవని నా నమ్మకం. జీవితంలో భద్రతా భావం లేకుండా నేను బతికాను, కానీ నీకా బాధలేదు. ఇవి ఆ లోటు తీర్చుతాయి, మంగేషనాథుడు నిన్నెప్పుడూ కనిపెట్టుకుని ఉంటాడు” అని ఆయన చెప్పారట. ఆయన మాటలు నిజమయ్యాయి. ఆ రెండే పెట్టుబడిగా కెరీర్ ప్రారంభించిన లతా మంగేష్కర్ ఎంతో ఎత్తుకు ఎదిగారు.
Read Also : లతాజీ ఇంటి పేరు వెనుక ఉన్న కథ
‘దీనానాధ్ లతా తండ్రి అట’ అని అందరూ అనుకునేంత పేరును ఆమె సంపాదించుకున్నారు. దారిద్యం కారణం తండ్రికి సరైన చికిత్స అందించలేకపోయాననే బాధ లతా మంగేష్కర్ లో ఎప్పుడూ ఉండేది. అందుకే ఆమె పుణేలో తండ్రి పేర ఓ హాస్పిటల్ కట్టించారు. 1942 ఏప్రిల్ 24న తన 42వ యేట దీనానాధ్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల చేతిలో పెద్దంత డబ్బులేదు. ఆయన భోగభాగ్యాలు అనుభవించినప్పుడు వెనకే ఉన్న బంధువులంతా అప్పుడు ముఖం చాటేశారు. అప్పుడో టాక్సీ వాలా… చనిపోయింది దీనానాధ్ అని తెలుసుకుని, ఆయన నిర్వహించిన బల్వంత్ సంగీత్ మండలి కార్యక్రమాలకు తన టాక్సీలో ఎంతోమందిని, ఎన్నో సార్లు తీసుకెళ్ళాననే విషయాన్ని గుర్తు చేసుకుని, ఆయన భౌతిక కాయాన్ని తన టాక్సీలోనే ఇంటికి చేర్చాడట. కొడుకు హృదయనాధ్ చాలా చిన్నవాడు కావడంతో, సాటి నటుడు శ్రీపాద్ జోషి దీనానాధ్ చితికి నిప్పు అంటించారు. ఆరోజు టాక్సీవాలాతో కలిపి శ్మశానంలో ఉంది కేవలం ఆరుగురేనట!