ఆరేళ్ళ క్రితం సహజ నటి జయసుధ, నిర్మాత నితిన్ కపూర్ తనయుడు శ్రేయాన్ హీరోగా టాలీవుడ్ లోకి ‘బస్తీ’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో అతను నటనకు గుడ్ బై చెప్పేశాడు. అయితే అదే సమయంలో జయసుధ మరో కుమారుడు నిహార్ కపూర్ ను చూసిన వాళ్ళు… అతనితో విలన్ పాత్రలు చేయిస్తే బాగుంటుందనే సలహా ఇచ్చారు. ఆరు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు ఉండే నిహార్ కపూర్ ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగానే విలన్ గా వెండితెరపై ప్రత్యక్షం అవుతున్నాడు.
లక్ష్ హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ మూవీలో నిహార్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నాడు. సెప్టెంబర్ 7 అతని పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. గంభీరమైన ఆకారంతో క్రూరమైన చూపుతో, చేతిలో పొడవాటి కొడవలి పట్టుకుని కూర్చున్న నిహార్ ను చూస్తుంటే… టాలీవుడ్ కు మరో సరికొత్త యంగ్ విలన్ దొరికినట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ మూవీలో లక్ష్ చదలవాడ సరసన వేదిక దత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఈషాన్ సూర్య దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు.