‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిన కుబ్రా సెయిట్.. కొన్ని రోజుల నుంచి సంచలన విషయాల్ని షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లోకెక్కుతోంది. ఇటీవల తన కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ సభ్యుడు తనని లైంగికంగా వేధించాడంటూ ఈ అమ్మడు బాంబ్ పేల్చింది. అతని వల్లే వర్జినిటీ కోల్పోయానని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు తన ఓ వ్యక్తితో బెడ్ షేర్ చేసుకోవడం, అబార్షన్ చేయించుకోవడం వంటి షాకింగ్ విషయాల గురించి చెప్పుకొచ్చింది.
తాను రాసిన ‘ఓపెన్ బుక్: నాట్ ఏ క్వైట్ మెమోయిర్’ అనే పుస్తకం జూన్ 27వ తేదీన విడుదల చేసిన కుబ్రా.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే వన్ నైట్ స్టాండ్, అబార్షన్ వంటి టాపిక్స్‌ని తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ‘‘2013లో నేను అండమాన్ పర్యటనకు వెళ్లాను. అప్పుడు నా వయసు 30. స్కూబా డైవింగ్ సెషన్ తర్వాత డ్రింక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఓ స్నేహితుడితో పడుకున్నాను. కొన్నాళ్లకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలింది. వారం రోజుల పాటు ఆలోచించిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకొని, అబార్షన్ చేయించుకున్నా’’ అంటూ కుబ్రా సెయిట్ తెలిపింది.
ఆ సమయంలో తాను తల్లి కావడానికి సిద్ధంగా లేనని, ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని అనుకోవడం లేదని కుబ్రా చెప్పింది. అమ్మాయిలు 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలి, 30 ఏళ్లకు పిల్లల్ని కనాలనే విషయాలు తనకు అర్థం కావని పేర్కొంది. అబార్షన్ చేయించుకున్నందుకు తనకెలాంటి పశ్చాత్తాపం లేదంది. నా ఛాయిస్ నాకుంటుందని చెప్పిన కుబ్రా.. ఇలాంటి విషయాల్ని షేర్ చేసుకోవడంలో ఇబ్బంది లేదని తాను భావిస్తున్నానని, అందుకే ఈ పుస్తకం రాశానంది. తాను రాసిన పుస్తకంలో 24 చాప్టర్స్ ఉంటాయని.. ప్రతీ చాప్టర్ ఆసక్తికరంగా ఉంటుందని కుబ్రా సెయిట్ చెప్పుకొచ్చింది.