Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!

Krishnavataram Part 1 Hridayam

Krishnavataram Part 1 Hridayam

భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని నేటి యువతకు చేరువ చేయాలన్న సంకల్పంతో రూపొందిన చిత్రం ‘కృష్ణావతారం పార్ట్ 1: హృదయం’. ఈ సినిమా బృందంతో ప్రత్యేకంగా భేటీ అయిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సినిమాలోని కంటెంట్ పట్ల ప్రశంసలు కురిపించారు. వినోదపు పన్నును రద్దు చేయడం ద్వారా సామాన్య ప్రేక్షకులకు, విద్యార్థులకు తక్కువ ధరకే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

“నేటి తరం విద్యార్థులు మన దేశ ఘనమైన సంస్కృతిని, శ్రీకృష్ణుడి జీవన పరమార్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చిత్రాలు వారిలో ఆధ్యాత్మిక స్పృహను పెంపొందిస్తాయి” అని సీఎం యోగి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చిత్ర దర్శకుడు హార్దిక్ గజ్జర్, కథానాయకుడు సిద్ధార్థ్ గుప్త, కథానాయిక సంస్కృతి జయానా , ఇతర చిత్ర బృందం ముఖ్యమంత్రిని కలిసి సినిమా విజయ విశేషాలను పంచుకున్నారు.

దీంతో మే 7న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 42 లక్షలతో నెమ్మదిగా మొదలైనప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా వీకెండ్‌లో వసూళ్లు పుంజుకున్నాయి. ఆదివారం ఒక్కరోజే రూ. 3.50 కోట్లు సాధించడం విశేషం. మొత్తంగా నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 7.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించడంతో రానున్న రోజుల్లో ఈ వసూళ్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మూడు భాగాలుగా రానున్న ఈ కృష్ణావతారం ఫ్రాంచైజీలో ‘హృదయం’ మొదటి అధ్యాయంగా విడుదలై ఆధ్యాత్మిక ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.