Kirayi Dada Completed 35 Years: చిత్రసీమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలను చేరుకున్నవారెందరో ఉన్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు వి.దొరస్వామి రాజు. పంపిణీదారుడుగా, నిర్మాతగా, రాజకీయ నాయకునిగా ఆయన సక్సెస్ రూటులో సాగారు. ఆయన సినిమా ప్రయాణం తొలుత 1978లో తిరుపతి ఏరియాకు పంపిణీదారునిగా మొదలయింది. యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘సింహబలుడు’ చిత్రాన్ని రాయలసీమలో ద్వారకా ఫిలిమ్స్ సంస్థ పంపిణీ చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన దొరస్వామి రాజు తన జిల్లాలో ‘సింహబలుడు’ సినిమా హక్కులు పొందారు. ‘సింహబలుడు’ హీరో యన్టీఆర్ చేతుల మీదుగానే తన ‘విజయ మల్లేశ్వరి కంబైన్స్’ (వి.యమ్.సి.) సంస్థను ఆరంభించారు రాజు. ఆ పై యన్టీఆర్ ‘డ్రైవర్ రాముడు, వేటగాడు’ చిత్రాలతో సీడెడ్ లో పేరున్న డిస్ట్రిబ్యూటర్ గా జయకేతనం ఎగురవేశారు రాజు. తరువాత ఎన్నెన్నో సూపర్ హిట్ మూవీస్ ను పంపిణీ చేసి విజయం సాధించారు. ‘విజయలక్ష్మి పిక్చర్స్’ (వి.ఎల్.పి.)అనే పంపిణీ సంస్థనూ నెలకొల్పారు. ఏదేమైనా ఆయనను అందరూ ‘వి.ఎమ్.సి.’ దొరస్వామి రాజుగానే గుర్తించేవారు. ఆయన నిర్మాతగా మారి తమ ‘వియమ్.సి. ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘కిరాయిదాదా’. నాగార్జున అక్కినేని హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1987 నవంబర్ 12న విడుదలై విజయపథంలో పయనించింది. ఈ చిత్రం ద్వారానే అమల తెలుగు చిత్రసీమకు పరిచయం కావడం విశేషం! ఈ చిత్రానికి హిందీలో విజయం సాధించిన ‘జాల్’ ఆధారం.
‘కిరాయి దాదా’ కథ ఏమిటంటే- డాన్సర్ అరుణాబాయి నాట్యం చేస్తూండగా, సత్యం వచ్చి ఓ విషయం చెప్పి మరణిస్తాడు. అతని కుటుంబాన్ని వెదుక్కుంటూ వెళ్ళిన అరుణ అక్కడ సత్యం కొడుకు విజయ్, ఓ చౌకదుకాణదారుని అన్యాయాన్ని అరికట్టడం కళ్ళారా చూస్తుంది. మాలినిగా పేరు మార్చుకుంటుంది అరుణ. విజయ్ నిరుద్యోగం, అతని ఇంటి కష్టాల కారణంగా మాలిని చెప్పినట్టు చేయడానికి పూనుకుంటాడు. కాలేజ్ అమ్మాయిలైన లత, రేఖకు ఓ గొడవతో పరిచయమవుతాడు విజయ్. తరువాత ఆ అమ్మాయిలిద్దరూ విజయ్ ని ప్రేమిస్తారు. విజయ్ మాత్రం లతనే ఇష్టపడతాడు. రేఖ తండ్రి ధనవంతుడైన నాగరాజ వర్మ. అతని దగ్గర పనిచేసే కోటి కూతురు లత. నాగరాజ వర్మ దగ్గరే ఓ ప్లాన్ ప్రకారం చేరతాడు విజయ్. చివరకు అతనికి లత అసలు తండ్రి నాగరాజ వర్మ సోదరుడైన కృష్ణరాజ వర్మ అన్న విషయం తెలుస్తుంది. అతడిని చంపేసి ఆ నేరం విజయ్ తండ్రి సత్యంపై వేసి ఉంటారు. అసలు నిజాలు తెలిసిన సత్యం చివరకు నాగరాజ వర్మను చితకబాది తల్లి కాళ్ళ పై పడేస్తాడు. ఆమె దయతలచి వదిలేయమంటుంది. అదే సమయంలో నాగరాజ వర్మ కూతురు రేఖ వచ్చి పేద ప్రజల నుండి దోచుకున్న భూములు వాళ్ళకే ఇవ్వమని చెబుతుంది. ఆమె మాట అంగీకరించకుండా అహంకారంతో అడ్డు వచ్చిన మాలినిని చంపేస్తాడు. అది చూసిన విజయ్ నాగరాజవర్మ చేతిలోని పిస్తోల్ తీసుకొని, అతడినే కాల్చేస్తాడు. కృష్ణరాజవర్మ, మాలిని శిలావిగ్రహాలు నెలకొల్పడం, విజయ్, లత ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో ఖుష్బూ, జయసుధ, రావు గోపాలరావు, గొల్లపూడి, మురళీమోహన్, సుధాకర్, శ్రీధర్, రాళ్ళపల్లి, మాడా, సుత్తివీరభద్రరావు, కె.కె.శర్మ, అన్నపూర్ణ, వరలక్ష్మి, అనిత, మహీజా ఇతర పాత్రధారులు. జయసుధ భర్తగా కృష్ణంరాజు అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు సత్యానంద్ మాటలు రాయగా, వేటూరి, జొన్నవిత్తుల పాటలు రాశారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. ‘రాత్రి వేళకు రేరాణిని…’ , ‘వన్ టూ త్రీ వాటేసెయ్…’, ‘కురిసే మేఘాలు…’, ‘నీ బుగ్డపండు…’, ‘నా లాంటి మజ్నులూ..’, ‘గుంతలకిడి..’ అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ‘కిరాయిదాదా’ మంచి విజయం సాధించింది. తన కెరీర్ లో పంపిణీదారునిగా, రాజకీయ నాయకునిగా ప్రతిమలుపులోనూ యన్టీఆర్ అండదండలతో సాగిన వి.యమ్.సి.దొరస్వామి రాజు, సినిమాల్లో మాత్రం ఏయన్నార్ కుటుంబంతోనే భలేగా సాగారని చెప్పవచ్చు. ‘కిరాయి దాదా’ విజయంతో తరువాత ‘సీతారామయ్యగారి మనవరాలు’ను ఏయన్నార్, మీనాతో తెరకెక్కించి అలరించారు రాజు. ఆ తరువాత నాగార్జునతో “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అన్నమయ్య” వంటి జనరంజక చిత్రాలు నిర్మించారు దొరస్వామి రాజు. యన్టీఆర్ మనవడు జూనియర్ యన్టీఆర్ తో ఆయన నిర్మించిన ‘సింహాద్రి’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. దొరస్వామి రాజు నిర్మాతగా దాదాపు డజన్ కు పైగా చిత్రాలు నిర్మించారు. అన్నిటా తన అభిరుచిని చాటుకున్నారు. నిర్మాతగా దొరస్వామి రాజు తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడానికి ఆరంభంగా ‘కిరాయి దాదా’ నిలచింది.