బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలి కాలంలో తన రూపంలో వచ్చిన భారీ మార్పుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఆయన ఇంత వేగంగా బరువు తగ్గడం వెనుక ‘ఓజెంపిక్’ వంటి మందుల ప్రభావం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కరణ్ ఈ వార్తలపై స్పందిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను , తన ఫిట్‌నెస్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు.
కరణ్ జోహార్ మాట్లాడుతూ, తన బరువు విషయంలో తన తల్లిదండ్రులకు భిన్నమైన అభిప్రాయాలు ఉండేవని చెప్పారు. తన తండ్రి యష్ జోహార్ ఎప్పుడూ తనను అమితంగా ప్రేమించేవారని, తన బరువును కేవలం ‘పప్పీ ఫ్యాట్’ (చిన్నపిల్లల కొవ్వు) అని కొట్టిపారేస్తూ తను హీరోలా ఉన్నాడని అనేవారని గుర్తు చేసుకున్నారు. అయితే, తన తల్లి హీరూ జోహార్ మాత్రం వాస్తవాలను మొహం మీదే చెప్పేవారని కరణ్ తెలిపారు. “యష్, వాడు చాలా లావుగా ఉన్నాడు, వాడు ఎప్పటికీ హీరో కాలేడు” అని తన తల్లి తన తండ్రితో గొడవపడేవారని ఆయన సరదాగా వెల్లడించారు. తన రూపం పట్ల తన తల్లి చేసిన విమర్శలే తనను ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేలా చేశాయని ఆయన పేర్కొన్నారు.
కాలేజీ రోజుల్లో విపరీతంగా బరువు తగ్గాలనే పట్టుదలతో కరణ్ జోహార్ ‘అట్కిన్స్ డైట్’ అనే కఠినమైన ఆహార నియమాన్ని పాటించారు. కేవలం ప్రోటీన్లు మాత్రమే తీసుకుంటూ కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేసిన ఆయన, సుమారు నెల రోజుల తర్వాత ఒకరోజు క్లాస్ జరుగుతుండగానే స్పృహ తప్పి పడిపోయారు. ఆ సంఘటన తర్వాత తన తల్లి ఆ డైట్‌ను కఠినంగా నిషేధించారని, సరైన పద్ధతిలో బరువు తగ్గడం ఎంత ముఖ్యమో తనకు అప్పుడు అర్థమైందని ఆయన వివరించారు.
తాను బరువు తగ్గడానికి ‘ఓజెంపిక్’ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు వాడుతున్నాననే వార్తలను కరణ్ పూర్తిగా ఖండించారు. తన ఫిట్‌నెస్ వెనుక కఠినమైన క్రమశిక్షణ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రియాలోని ప్రముఖ హెల్త్ రిసార్ట్ ‘వివామేయర్’కు వెళ్లినప్పుడు తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసిందని, ముఖ్యంగా తనకు గ్లూటెన్ , లాక్టోస్ పడవని (Intolerance) గుర్తించినట్లు చెప్పారు. అలాగే తనకు థైరాయిడ్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ కావడంతో దానికి చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. ఆహారంలో గ్లూటెన్, చక్కెరను పూర్తిగా పక్కన పెట్టి, బాదం పాలు (Almond Milk) వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం వల్లే తాను సహజంగా బరువు తగ్గానని కరణ్ వివరించారు.
కేవలం బాహ్య రూపం కోసమే కాకుండా, తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని జీవనశైలిని మార్చుకోవడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని, అక్రమ మార్గాల్లో బరువు తగ్గాల్సిన అవసరం తనకు లేదని కరణ్ జోహార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
India-China: “షక్స్‌గామ్ వ్యాలీ మాదే, భారత్‌ది కాదు”.. చైనా ప్రకటన..
