మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి మేకల కాగా, డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌లు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ…“కరణ్ అర్జున్` టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని కితాబిచ్చారు. దర్శకుడు స్టోరి లైన్ కూడా చెప్పారని, ప్రజంట్ ట్రెండ్ కి కనెక్టయ్యే స్టోరీ అని ఆయన తెలిపారు. టీమ్ అందరూ కూడా ఎంతో ప్యాషన్ తో సినిమా తీసినట్లు కనిపిస్తోందని, ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘ సినిమా ఫస్ట్ లుక్ పరశురామ్ గారు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధన్యవాదాలు. ఇంత వరకు ఎవరూ చేయని లొకేషన్స్ లో పాకిస్థాన్ బార్డర్ లో ఎంతో రిస్క్ తీసుకుని మా సినిమా షూటింగ్ చేశాం. మూడు పాత్రలతో ఊహించని మలుపులతో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా సాగే రోడ్ థ్రిల్లర్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి మా నిర్మాతలే కారణం. వారు ఎక్కడా రాజీ పడకుండా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో అనుకున్నట్లు గా తీయగలిగాను. మా నిర్మాతలందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం“ అన్నారు.