NTV Telugu Site icon

సల్లూభాయ్‌ తో రాజీపడిన కమాల్‌ ఖాన్!

బాలీవుడ్‌ యాక్టర్, ప్రొడ్యూసర్ కమాల్ ఆర్ ఖాన్ తన ఘాటైన వ్యాఖ్యలతో టాప్ హీరోస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాడు. అతను చేసే కొన్ని విమర్శలైతే పనికట్టుకుని చేస్తున్నట్టే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కమాల్ ఖాన్ చేసే విమర్శలు సల్మాన్‌ ఖాన్ నే ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. గత యేడాది సల్మాన్‌ ఖాన్ ‘రాధే’ మూవీ విడుదల కాగానే దాన్ని చీల్చి చెండాడుతూ కమాల్ ఖాన్ రివ్యూ రాశాడు. దానిపై సల్మాన్‌ డిఫమేషన్‌ కేసు కూడా వేశాడు.

కారణం ఏమిటో తెలియదు కానీ నిన్న మొన్నటి వరకూ సల్మాన్‌ ఖాన్ ను సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఆడుకున్న కమాల్ ఖాన్ ఇప్పుడు రాజీ ధోరణికి వచ్చేశాడు. తాను పెట్టే ప్రతి పోస్ట్ ను సల్మాన్‌ ఖాన్ కు వర్తించవద్దని మీడియాకు మనవి చేసుకున్నాడు. సల్మాన్‌ తో పాటు టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని కూడా తాను వ్యాఖ్యలు చేస్తుంటానని, నిజానికి సల్మాన్‌ తనకు బిగ్ బ్రదర్ లాంటి వాడని, మీడియా చేసే అనవసరపు రాద్ధాంతం వల్ల సల్మాన్‌ ఖాన్ తనను అపార్థం చేసుకునే ఆస్కారం ఉందని కమాల్ వాపోయాడు. ఈ మధ్యే సల్మాన్ ఖాన్ సిక్స్ ప్యాక్ ను కూడా ఫేక్ అంటూ కమాల్ ఆర్ ఖాన్ ఓ పోస్ట్ పెట్టాడు. అలానే బాలీవుడ్ హీరోలనూ బాగానే టార్గెట్ చేశాడు. తమ కోసం సినిమాలు తీసే హీరోలు వాటిని ఇంట్లో చూసుకుంటూ సరిపోతుందని, వాళ్ళ కోసం కాకుండా పబ్లిక్ ను దృష్టి లో పెట్టుకుని సినిమాలు తీయాలని హిత బోధ చేశాడు. ఏదేమైనా ఘాటైన విమర్శలు నిన్నటి వరకూ గుప్పించిన కమాల్ ఇప్పుడు ఇలా మారిపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అని అంతా ఆలోచనలో పడ్డారు.