విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తరువాత ‘విక్రమ్’ సినిమాతో థియేటర్లోకి అడుగుపెడుతున్న విషయం విదితమే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండగా హీరో సూర్య ఒక స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రామిసింగ్ ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు కమల్ తీసుకున్న రెమ్యూనిరేషన్ హాట్ టాపిక్ గా మారింది. విక్రమ్ సినిమాకు గాను కమల్ ఏకంగా రూ. 120 కోట్లు ఛార్జ్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.. ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇంత రెమ్యూనిరేషన్ తీసుకోకపోవడం గమనార్హం. కమల్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఐయే గత కొన్నేళ్లుగా కమల్ కు హిట్ లేదు.. సినిమాల్లో కనిపించింది లేదు.. రాజకీయాలు, బిగ్ బాస్ షో తో నెట్టుకొచ్చిన కమల్ ఒక్క సినిమాకు అంత డిమాండ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇక ఈ సినిమాకు కమల్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం విదితమే. దీంతో హీరో, నిర్మాత రెమ్యూనిరేషన్ షేర్ల పరంగా తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలోని మిగతా క్యారెక్టర్ లు విజయ్, ఫహద్ కూడా బాగానే అందుకున్నారట. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దాదాపు రూ.8 కోట్లు అందుకున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతికి రూ.10 కోట్లు, ఫహద్ ఫాజిల్‌కు రూ.4 కోట్ల మేర పారితోషికం సర్దినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన అనిరుధ్ రవిచందర్‌కు సైతం రూ. 4 కోట్లు ముట్టజెప్పారని టాక్ నడుస్తోంది. రెమ్యూనిరేషన్లకే కోట్లు సరిపోయాయి.. మరి చిత్ర బడ్జెట్ ఎంత అయ్యి ఉంటుందో అని కోలీవుడ్ జనాలు నోళ్లు నొక్కుకుంటున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యి కమల్ కు ఏ రేంజ్ ను తీసుకొస్తుందో చూడాలి.