Kalyan Ram Planning Pan India Film With Jr NTR: ‘మనం’ సినిమా వచ్చినప్పటి నుంచి.. నందమూరి హీరోలతోనూ అలాంటి ఫ్యామిలీ సినిమా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు.. కచ్ఛితంగా తాము కలిసి సినిమా చేస్తామంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. కానీ, ఎప్పుడన్నది చెప్పలేమన్నాడు. అయితే.. ఈలోపు తాను తమ్ముడు తారక్‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. బింబిసార ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ ఆ విషయం చెప్పాడు. తారక్, బాలయ్యలతో కలిసి సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఎదురవ్వగా.. తమ్ముడు తారక్‌తో ఓ పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తున్నానని కళ్యాణ్ తెలిపాడు. అలాగే.. ఒక మంచి కథ కుదిరితే, బాబాయ్ (బాలయ్య)తోనూ ఓ సినిమా నిర్మిస్తానన్నాడు. మరి, ఈ ప్రాజెక్టులు ఎప్పుడు కుదురుతాయో కాలమే సమాధానం చెప్పాలి.
ఇదే సమయంలో బింబిసారను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయకపోవడానికి గల కారణాల్ని కళ్యాణ్ వెల్లడించాడు. ‘‘కోవిడ్‌కి ముందు మేము ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాం. ఆ సమయంలో ఇతర భాషల్లో చేయాలన్న ఆలోచన రాలేదు. ఇప్పటికిప్పుడు ఇతర భాషల్లో విడుదల చేయాలంటే.. చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్, ప్రమోషన్స్ కోసం ఎక్కువ సమయం పడుతుంది. అంత సమయం లేకపోవడం వల్లే తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధిస్తే.. ఇతర భాషల్లో విడుదల చేయడంపై ఆలోచిస్తాం’’ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఏ కథ ఏ హీరోకి దక్కాలో ముందే రాసి పెట్టి ఉంటుందని తన తండ్రి హరికృష్ణ తనకు చెప్పేవారని.. ‘అతనొక్కడే’ కథ కూడా ఎందరో విన్నా ఫైనల్‌గా తాను చేశానని గుర్తు చేశాడు. అలాగే ‘బింబిసార’ కథ తన కోసం పుట్టిందని.. ప్రేక్షకుల అంచనాలను వందశాతం తాము రీచ్ అవుతామని నమ్మకం వెలిబుచ్చాడు. ‘బింబిసార 2’ కథ సైతం సిద్ధంగా ఉందని తెలిపాడు.