మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగి నెల రోజులు పూర్తయ్యింది. ఇప్పుడిప్పుడు ఆ సందడి సద్దుమణుగుతోంది. నిజానికి ‘మా’ ఎన్నికలు జరిగిన రోజునే సినిమా రంగంలోని మరో రెండు యూనియన్ల ఎన్నికలు జరిగినా, ఎవరూ దాని మీద దృష్టే పెట్టలేదు! కారణం… అవన్నీ సజావుగా సాగిపోవడమే! ఇదిలా ఉంటే… ఈ నెల 14వ తేదీ రెండవ ఆదివారం తెలుగు దర్శకుల సంఘం ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా కాశీ విశ్వనాథ్, చంద్రమహేశ్, సముద్రకు చెందిన మూడు ప్యానెల్స్ బరిలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే… ఇంతలో ఎన్నికల ప్రధాన అధికారిగా కె.వి.ఆర్. చౌదరి వైఖరిపై జర్నలిస్టు ప్రభు నిరసన వ్యక్తం చేస్తూ, కోర్టుకెక్కారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడైన జర్నలిస్ట్ ప్రభు దాసరి తెరకెక్కించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. అలానే శ్రీకాంత్ హీరోగా ‘మొండోడు’ సినిమాను డైరెక్ట్ చేశారు. కరోనా టైమ్ లో రామ్ గోపాల్ వర్మపై ఆయన తీసిన ‘రాంగ్ గోపాల్ వర్మ’ మూవీ ఏటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇదిలా ఉంటే… తాను దర్శకుల సంఘం ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్ గా వేసిన నామినేషన్ ను రిటర్నింగ్ ఆఫీసర్ కె.వి.ఆర్. చౌదరి తిరస్కరించడాన్ని ప్రభు కోర్టులో సవాల్ చేశారు. తాను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కారణంగా దర్శకుల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకూడదని కె.వి.ఆర్. చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారని, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు సినిమా రంగంలోని 24 శాఖలకు సంబంధం లేదని, నిజానికి ఆ యా శాఖలలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న వారు కూడా పలు యూనియన్ల పదవులలో ఉన్నారని ప్రభు తెలిపారు. దర్శకుల సంఘం బై లా లో లేని అంశాలను తెరపైకి తీసుకొచ్చి, ఎన్నికల అధికారి తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని ఆరోపించారు. తనకు న్యాయం జరిగేలా చూడమంటూ సోమవారం కోర్టులో రిట్ పిటీషన్ వేసినట్టు సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు ప్రభు తెలిపారు.
ఈ వ్యవహారం చూస్తుంటే, ఈ నెల 14న తెలుగు దర్శకుల సంఘం ఎన్నికలు సైతం హోరాహోరీగా జరిగే ఆస్కారం కనిపిస్తోంది.