బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిపోయింది అంటున్నారు మిగిలిన నటులు.. మొన్నటికి మొన్న టాలీవుడ్ లో నటించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన జాన్ ప్రస్తుతం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకొంటున్నాడు. ప్రస్తుతం డిజిటల్ రంగంపైనే అందరి చూపు ఉన్న విషయం విదితమే. థియేటర్లో రిలీజ్ చేయడం కన్నా ఓటిటీ లో రిలీజ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ఆలోచనకు నిర్మాతలు వచ్చేశారు అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోలు సార్థం తమ మార్కెట్ ను పెంచుకోవడానికి ఓటిటీ బాట పడుతున్నారు.
ప్రముఖ ఓటిటీ సంస్థలు నిర్మిస్తున్న ఒరిజినల్ సిరీస్ లలో నటించడం మంచి అవకాశంగా భావిస్తున్నారు.. కానీ ఇలాంటి అవకాశం తనకు వద్దు అంటున్నాడు జాన్ అబ్రహం. తన రేంజ్ అది కాదని, తాను బిగ్ స్క్రీన్ హీరోను అని చెప్పి మరో కాంట్రవర్సీకి తెరలేపాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్ ఓటిటీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ “నేను ఒక నిర్మాతగా ఓటిటీ లో సినిమాలను నిర్మించమంటే నిర్మిస్తాను కానీ ఒక నటుడిగా ఎప్పటికీ ఓటిటీలోకి అడుగుపెట్టాను.. చీప్ గా రూ. 400, రూ. 500 కు ప్రేక్షకులకు అందుబాటులో ఉండను. ఎందుకంటే ఇంట్లో సినిమా చూసే వారు సినిమా చూస్తూ అన్ని పనులు చేస్తూ ఉంటారు. అది నాకు నచ్చదు. ఒక సినిమా చూస్తే దాని మీదే మూడు గంటలు దృష్టి పెట్టాలి.
ఇక ఓటిటీ నా రేంజ్ కాదు. నేను థియేటర్ లో కనిపించే హీరోను.. బిగ్ స్క్రీన్ హీరోను.. అక్కడే ఉండాలనుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు . ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే ఇప్పుడు ఓటిటీ లో చేస్తున్న హీరోలందరూ వేస్ట్ అని ఈ హీరో ఉద్దేశ్యమా..? అని కొందరు.. నీ సినిమా ఓటిటీ లో వచ్చినా కూడా ఎవరు చూసేవారు లేరని మరికొందరు ఏకిపారేస్తున్నారు. ఇక ప్రస్తుతం జాన్ అబ్రహం నటించిన ఏక్ విలన్ రిటర్న్స్ జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.