జానీ డెప్ అనగానే విలక్షణమైన నటన, అంతకు మించిన విలక్షణమైన వ్యక్తిత్వం. సినిమాల్లో పలు వేషాలు వేసిన జానీ డెప్ నిజజీవితంలోనూ అదే తీరున సాగాడు. అందువల్ల పలు విమర్శలకూ లోనయ్యాడు. ఈ మధ్య మాజీ భార్య అంబర్ హర్డ్ కారణంగా కోర్టు మెట్లెక్కాడు. జానీ డెప్, అంబర్ హర్డ్ ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. వాటిలో అంబర్ పక్షాన రెండు, జానీ తరపున మూడు కేసులు సక్సెస్ చూశాయి. జానీ ఓడిపోయిన కేసులో అతను హర్డ్ కు 2 మిలియన్ల డాలర్లు పరిహారంగా చెల్లించాడు. జానీ గెలిచిన కేసులో అంబర్ 10 మిలియన్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించవలసి వచ్చింది. జానీ పై కేసులు నమోదయిన కారణంగా ఆయనను కొన్ని చిత్రోత్సవాల్లో నిషేధించారు. అయితే కేసులు పూర్తయిన సందర్భంగా జానీ డెప్ నటించిన ‘జియానే డ్యూ బ్యారీ’ చిత్రాన్ని మేలో జరగనున్న కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించాలని నిర్ణయించారు.
జానీ డెప్ ‘జియానే డ్యూ బ్యారీ’ని కాన్స్ లో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించడం కొందరికి నచ్చడం లేదు. దాంతో వివాదానికి తెర లేపారు. పైగా జానీ డెప్ సినిమాను మొట్టమొదటి చిత్రంగా ప్రదర్శించడం ఏమిటనీ కొందరు నిలదీశారు. అయితే జానీ డెప్ ను కాన్స్ చిత్రోత్సవంలో ఎవరూ ఎప్పుడూ బ్యాన్ చేయలేదని, విమర్శించేవారు ఈ విషయం తెలుసుకోవాలని కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియెర్రీ ఫ్రీమాక్స్ అంటున్నారు. పైగా జానీ డెప్ కోర్టులోనూ కేసు గెలిచాడన్న విషయాన్ని మరచిపోరాదనీ థియెర్రీ గుర్తు చేస్తున్నారు. పైగా ‘జియానే డ్యూ బ్యారీ’ చిత్రంలోని కథాంశం కూడా అంత గొప్పగా ఏమీ లేదని విమర్శకులు అంటున్నారు. జియానే అనే రాణివాసపు కన్య ఎంతో అందంగా ఉంటుంది. తన చేతలతో డిప్రెషన్ లో ఉన్న పదిహేనవ లూయీ రాజును వశం చేసుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నదే కథ. ఇలాంటి విలువలు లేని సినిమాను ప్రదర్శించడం సరికాదన్నది కొందరి వాదన. అయితే ఇందులో ఓ స్త్రీ మానసిక సంఘర్ణణ ఉంటుందని, దానిని తెలుసుకోలేని వారు ఫెస్టివల్ సభ్యులుగా ఉండడానికే అనర్హులనీ డైరెక్టర్ అభిప్రాయం. ఏది ఏమైనా జానీ డెప్ తాజా చిత్రం సైతం వివాదాలకు తెరతీసిందన్న మాట!