Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్‌ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!

  • ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సంచలన నిర్ణయం
  • జానీ మాస్టర్‌కు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సహాయ నిరాకరణ
  • ఏ సినిమా చేసినా 23 క్రాఫ్ట్‌లు పనిచేయవని ప్రకటన
Jani Master Ban

Jani Master Ban

Jani Master Faces Film Federation Boycott: ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్.. ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాలో పనిచేసినా.. సినీ పరిశ్రమకు చెందిన మిగతా 23 క్రాఫ్ట్‌ల సభ్యులు ఆ చిత్రానికి సహకరించరని ఫెడరేషన్ ప్రకటించింది. ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేస్తామని ఫెడరేషన్‌ తెలిపింది. జానీ మాస్టర్ తన భార్య పదవిని అడ్డుపెట్టుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫెడరేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని పలువురు ఫెడరేషన్ ప్రతినిధులు జానీ మాస్టర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 12న జానీ చేసిన వ్యాఖ్యలు, సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తీరు, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడంపై మండిపడింది. ఈ చర్యలకు వివరణ ఇవ్వాలంటూ జులై 14న విచారణకు పిలిచినా ఎందుకు రాలేదని మండిపడింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ వివాదంపై జానీ మాస్టర్‌కు ఇప్పటికే ఫెడరేషన్ వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. నిర్ణయించిన గడువులోగా ఆయన సరైన వివరణ ఇవ్వకపోతే.. శాశ్వతంగా బహిష్కరిస్తామని హెచ్చరించింది.

ఈ పరిణామం టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవేళ ఫెడరేషన్ ప్రకటించిన సహాయ నిరాకరణ అమల్లోకి వస్తే.. జానీ మాస్టర్‌తో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, దర్శకులకు ఇది పెద్ద అడ్డంకిగా మారనుంది. పరిశ్రమలోని వివిధ క్రాఫ్ట్‌ల మధ్య ఐక్యత, సంఘాల నిర్ణయాల ప్రాధాన్యత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడనే అంశంపై ఉంది. జానీ మాస్టర్ వివరణ తర్వాత ఫెడరేషన్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.