Kota Srinivasa Rao : కోట శ్రీనివాస రావు మరణం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోట జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం ఒకే ఒక్క డైరెక్టర్. ఆయన చేయించిన పాత్రతోనే కోటకు ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు వచ్చింది. ఆయనే జంధ్యాల. కోట 1978లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ప్రాణం ఖరీదు సినిమాలో చిన్న పాత్ర చేశారు. దాని తర్వాత మరో సినిమాలో కనిపించారు. పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఆయన నటన గురించి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. 1987లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా జంధ్యాల ఆహనా పెళ్లంట మూవీని మొదలు పెట్టారు.
Read Also : Kota Srinivasa Rao : బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చిన కోట..
ఇందులో పిసినారి లక్ష్మీపతి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని నిర్మాత రామానాయుడు, డైరెక్టర్ జంధ్యాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రావుగోపాల్ రావును తీసుకోమని రామానాయుడు సూచించారంట. కానీ కోట శ్రీనివాస రావు అయితేనే పర్ ఫెక్ట్ గా సెట్ అవుతాడని జంధ్యాల పట్టుబట్టారంట. ఇద్దరి మధ్య 20 రోజుల పాటు చర్చలు జరిగిన తర్వాత కోటనే తీసుకున్నారు. ఇందులో మాసిపోయిన చిన్న పంచె, బనియన్ మీదనే సినిమా మొత్తం కనిపిస్తాడు కోట. ఇందులో ఆయన పగిలిపోయిన కళ్లద్దాలు పెట్టుకుని, జుట్టు లేకుండా చిన్న తలకట్టుతో క్రాఫ్ చేయించుకుని కనిపించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర కంటే కోట పాత్రకే గుర్తింపు బాగా వచ్చింది. పిసినారిగా కోట నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాతో కోట వెనక్కి తిరిగి చూసుకోలేదు. కోట అంటే ఆహనా పెళ్లంట సినిమాకు ముందు తర్వాత అన్నట్టు ఆయన కెరీర్ మారిపోయింది. ఈ మూవీతో కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అప్పటి దాకా చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న కోటకు.. ఈ మూవీతోనే పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు, కామెడీ విలన్ రోల్స్ వచ్చాయి. ఇప్పటికీ లక్ష్మీపతి పాత్రపై మీమ్స్ వస్తున్నాయంటే.. అందులో కోట జీవించిన తీరు అలాంటిది. ఈ మూవీతో కోట కెరీర్ ను జంధ్యాల మార్చేశాడనే చెప్పుకోవాలి.
Read Also : Shankar : శంకర్ కలల ప్రాజెక్ట్.. మరో దిల్ రాజు దొరుకుతాడా..?