తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం “జన నాయగన్”. హెచ్ వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చట్టపరమైన చిక్కుల్లో పడింది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ విషయమై వివాదం తలెత్తి కోర్టు వరకు వెళ్లింది. దీనిపై నేడు చెన్నై హైకోర్టులో కీలక విచారణ జరగనుండటంతో కోలీవుడ్ మొత్తం ఈ తీర్పు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఇక ఈ రోజు వెలువడే తుది తీర్పు సినిమా భవితవ్యాన్ని, అలాగే తదుపరి విడుదల తేదీని నిర్ణయించనుంది.
Also Read : Rashmika Mandanna: ‘నేనేమీ హీరోని కాదు అంత తీసుకోవడానికి’.. రెమ్యునరేషన్ పుకార్లపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
ఈ భారీ ప్రాజెక్ట్‌ను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా, యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించింది. ఒకవేళ కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తే, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. లేనిపక్షంలో సినిమా మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో విజయ్ అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని, తమ నటుడిని వెండితెరపై చూసేందుకు ఆతృతగా ఉన్నామని పోస్టులు పెడుతున్నారు. నేడు వెలువడే కోర్టు తీర్పుపైనే ఈ ‘జన నాయగన్’ అదృష్టం ఆధారపడి ఉంది.
