‘కార్తికేయ’ సినిమాతో దర్శకుడిగా మారిన చందు మొండేటి… ఆ తర్వాత ‘ప్రేమమ్’, సవ్యసాచి’ చిత్రాలను రూపొందించాడు. అయితే మొదటి రెండు సినిమాలు సాధించిన విజయాన్ని ‘సవ్యసాచి’ పొందలేకపోయింది. తాజాగా ఇప్పుడు ‘కార్తికేయ -2’తో మరోసారి తన అదృష్టాన్ని చందు మొండేటి పరీక్షించుకోబోతున్నాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఈ సినిమా అనేక పర్యాయాలు వాయిదా పడినా, ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లకపోవడానికి ప్రధాన కారణంగా ఇది ‘కార్తికేయ’ ఫ్రాంచైజ్ కావడంతో పాటు… తాము ఎంచుకున్న కథ’ అని చందు తెలిపాడు. కృష్ణ తత్త్వాన్ని, ద్వారక నగరానికి సంబంధించిన అంశాలను ఈ సినిమా ద్వారా తెలియచేస్తుండటంతో ప్రేక్షకులలో ఆ ఆసక్తి అలానే ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ మూవీ గురించి మాట్లాడుతూ, ”కర్మ సిద్ధాంతాన్ని ఇందులో చూపించాం. దైవత్వంలో సైన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ‘కార్తికేయ’ మూవీలోని హీరో క్యారెక్టరైజేషన్ ఈ సీక్వెల్ లోనూ రన్ అవుతుంది. అందులో మాదిరిగానే ఇందులోనూ ఓ అడ్వంచర్ కు హీరో సిద్ధపడతాడు. అందువల్ల ‘కార్తికేయ’ను చూడని వారికి కూడా ఈ సినిమా అర్థమౌతుంది. సో… సహజంగానే ఈ మూవీతో జనాలు కనెక్ట్ అవుతారు” అనే ధీమాను వ్యక్తం చేశాడు.
సినిమా మెయిన్ థీమ్ ను వివరిస్తూ, ”శ్రీ కృష్ణుడు లేడని వాదించే వారు ఇప్పుడూ కొందరు ఉన్నారు. కానీ ఆయన ఉన్నాడన్నది వాస్తవం. దాన్ని చెప్పే చిరు ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశాం. దేవుడు అనేది ఓ ఫెయిత్. దాని వల్ల కొంత డిసిప్లిన్ మనకు అలవాటు అవుతుంది. ఆ నమ్మకంలో ఓ పాజిటివిటీ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ కథను తెరకెక్కించాం. నిజానికి ఇవాళ మనం చాలా విషయాలను మూఢ నమ్మకాలుగా కొట్టి పడేస్తుంటాం. కానీ ఆ కాలం నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అవి సమాజానికి ఎంతో ఉపయోగపడినవే! ఇవాళ కొన్ని ఇర్రిలవెంట్ కావచ్చు. అందువల్ల కామన్ సెన్స్ తో ఆలోచించి, మూఢత్వానికి పోకుండా, మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవాలి. అదే ఈ సినిమాలో చూపించాం” అని చెప్పారు.
నిఖిల్ పాత్ర గురించి చెబుతూ, ”’కార్తికేయ’లో మెడికల్ స్టూడెంట్ గా నటించిన నిఖిల్… ఇందులో డాక్టర్ గా నటించాడు. దాంతో అతని ఆలోచనా విధానం మరింత మెచ్యూరిటీతో ఉంటుంది. అలానే అనుపమ్ ఖేర్ ను కూడా అవసరం మేరకే తీసుకున్నాం. ఆయన ఉండే పది నిమిషాల సీన్స్ మూవీకి చాలా కీలకం. సినిమా విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన పాత్ర గురించి మాట్లాడతారు. దీనిని హిందీలోనూ రిలీజ్ చేయాలని అనుకున్నాం కాబట్టి…. ఉత్తరాదికి తెలిసిన వారు ఆ పాత్ర చేస్తే బాగుంటుందనే అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేసుకున్నాం” అని అన్నారు.
”పిల్లలు ‘కార్తికేయ-2’ మూవీని చూస్తే, మన చరిత్రను తెలుసుకునే ఆస్కారం ఉంటుందని, ఐదు నుండి పదిహేనేళ్ళ వారికి ఇది చాలా బాగా నచ్చుతుందని, వాళ్లు ఎంత ఎక్కువ మంది థియేటర్ కు వచ్చి ఈ మూవీని చూస్తే తాను అంత ఆనందిస్తాన’ని చందు మొండేటి తెలిపారు. తన తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని అన్నారు.