ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘ప్రైమ్ వీడియో’ నుంచి సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ సిద్ధమైంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఏడు ఎపిసోడ్ల హై-ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇసకపట్నం’ అధికారిక ట్రైలర్‌ను హైదరాబాద్‌లో మేకర్స్ చాలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక కల్పిత పోర్ట్ టౌన్ (రేవు పట్టణం) బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా రా అండ్ రస్టిక్ పొలిటికల్ క్రైమ్ డ్రామా అని అర్థమవుతోంది. అధికారం, డబ్బు, ప్రతీకారం కోసం మనుషులు ఎంతటి ద్రోహానికైనా ఎలా వెనుకాడరు అనే పాయింట్‌ను ఇందులో చాలా ఇంటెన్సివ్‌గా చూపించారు. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కలగలిపి కట్ చేసిన ఈ ట్రైలర్ సిరీస్ పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
ఈ సిరీస్ లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ.. “నా కెరీర్‌లోనే ఇప్పటివరకు చేయని అత్యంత వైవిధ్యమైన, భిన్నమైన పాత్ర ఇది. ఆశ, అధికారం కోసం మనుషులు ఆడే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి” అన్నారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన క్యారెక్టర్ గురించి చెప్తూ.. “ఇసకపట్నంలో నా పాత్ర పేరు భారతి. పవర్, సంఘర్షణలు ఉన్న ఒక క్రూరమైన ప్రపంచంలో తనదైన నిర్ణయాలతో ఒంటరిగా పోరాడే ధైర్యమున్న మహిళగా నేను కనిపిస్తాను. ఈ పాత్ర చేయడం ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్” అని పేర్కొంది. మరో కీలక పాత్రలో నటించిన స్టార్ నటుడు సునీల్ సైతం తాను మునుపెన్నడూ చేయని సరికొత్త వాస్తవిక పాత్రలో కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
ఈ సిరీస్‌కు ప్రశాంత్ రఘతి కథను అందించగా, తాజుద్దీన్ సయ్యద్ పవర్‌ఫుల్ మాటలు రాశారు. నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. జూలై 2 నుండి తెలుగుతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్లలో, అలాగే 15 భాషల సబ్‌టైటిల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఈ ‘ఇసకపట్నం’ రేవు పట్టణం సృష్టించబోయే విధ్వంసం అందుబాటులోకి రానుంది.

