NTV Telugu Site icon

Unstoppable 2: బాలయ్య షోలో ప్రభాస్ తన ‘రాణి’ ఎవరో చెప్పాడా?

Prabhas

Prabhas

Unstoppable 2: భారతీయ చలనచిత్ర కీర్తి కిరీటానికి ‘తెలుగు పింఛం’… ప్రాంతీయ చలన చిత్రాల ప్రపంచవ్యాప్త సన్మానానికి అతని అడుగు శ్రీకారం… పెద్దమనసు తనానికి నిలువెత్తు ఖనిజం… చిరునవ్వుతో లోకాన్ని గెలవగలిగే రాజసం అతని నైజం… అవును నిజం… ప్రభాస్ అతని నామధేయం.. అంటూ బాహుబలి స్టార్ ను బాలకృష్ణ ఆహ్వానించడం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్‌‌కు ఓ కళ తెచ్చిందని చెప్పవచ్చు. అదీగాక, ప్రభాస్ తో బాలయ్య టాక్ షో రెండు ఎపిసోడ్స్ గా రూపొందడం విశేషం. అందులో మొదటి ఎపిసోడ్ లోనే బాహుబలి స్టార్ ను వీర లెవెల్లో పొగిడేయడం మరింత విశేషం! ప్రభాస్ పై రూపొందించిన ఏవీ సైతం ఆయన అభిమానులను పులకింపచేసేలా ఉంది. అన్ స్టాపబుల్ సీజన్-1లో అల్లు అర్జున్ ఎంట్రీ కాస్త వరైటీగా చూపించారు. అదే తీరున ఈ సీజన్ లో ప్రభాస్ కు ప్రత్యేకతను ఆపాదించడం గమనార్హం! తన షూ సైజ్ ‘12.5’ అని ప్రభాస్ చెప్పగానే, ‘వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని’ అని బాలయ్య అనడంలోనే బాహుబలి స్టార్ కు ఎంత హైప్ క్రియేట్ చేశారో చెప్పవచ్చు.

ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ తనకు ‘అడవి’ అంటే ఎంతో ఇష్టమని, అందువల్లే దత్తత తీసుకున్నానని అని సమాధానం చెప్పారు. మరో ప్రశ్నకు “పెళ్ళి చేసుకుంటాను సార్… ఇంకా రాసిపెట్టలేదేమో…” అని అన్నారు ప్రభాస్. ఆపై మాటల్లో ‘బాలకృష్ణను శ్రుతి హాసన్, అసిన్ ‘హీ ఈజ్ సో క్యూట్’ అంటూ చెప్పారని’ ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ సినిమాల్లోని డైలాగ్స్ ఆడియో వినిపించి, ఆయనతోనే అవే సినిమాల్లోనివో చెప్పించడం ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచీ తనకు సిగ్గని, మా నాన్నకు కూడా ఎంతో సిగ్గుండేదని, ఈ విషయం పెదనాన్నగారి తెగింపు వచ్చి ఉంటే బాగుండేదని ప్రభాస్ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కోరుకున్నారు. ప్రభాస్ తమ సొంతవూరిలో విందు ఇచ్చినప్పుడు వచ్చిన జనాన్ని చూసి, “వాళ్ళు జనాల్లా లేరు… అర్జునుడి వెనకాల కురుక్షేత్రంలో సైనికుల్లా ఉన్నారు” అని బాలయ్య అనడం కూడా అలరించింది. “నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతారు” అంటూ ప్రభాస్ కు బాలయ్య వేసిన బిస్కెట్ మరీ అతిశయోక్తిగా ఉందనిపిస్తుంది. మరో ప్రశ్నకు సమాధానంగా “మా మదర్ నంబర్ వన్ క్రిటిక్” అని ప్రభాస్ చెప్పారు. ఇంకో ప్రశ్నకు తాను దర్శకులు బాపుకు, మణిరత్నం కు పెద్ద ఫ్యాన్ నని సమాధానమిచ్చారు ప్రభాస్. రొమాన్స్ కు సంబంధించిన ప్రశ్న వేసినప్పుడే అక్కడున్నవారిలో నవ్వులు పూశాయి. ఇక “మేడమ్ చెప్పేశారు కదా సార్ ఏమీ లేదని” అంటూ ప్రభాస్ చెప్పగానే, “మేడమ్ పేరేమిటి?” అని బాలయ్య రెట్టించారు. చివరకు కృతిసనన్ అని ఆన్సర్ ఇచ్చారు ప్రభాస్.

Read Also: Top Gear Review: టాప్ గేర్ మూవీ రివ్యూ

షో లో ఓ ఆట- అందులో భాగంగా డాట్ తీసి వేయగానే రామ్ చరణ్ పేరుకు తగిలింది. దాంతో ప్రభాస్ ఫోన్ లో నుండి చెర్రీకి ఫోన్ చేశారు. బాలయ్యతో చెర్రీ మాట్లాడుతూ, మీ షోకు ఓ పిలుపు దూరంలో ఉన్నానని అనడం వినోదం పంచింది. ప్రస్తుతం ప్రభాస్ రాణిగారూ ఎవరు అంటూ బాలయ్య ప్రశ్నించారు. బాలయ్యగారు అడిగితే రాణిగారి పేరు చెప్పేయరా అంటూ చెర్రీ అనడమూ అలరించింది. చివరకు ఏమీ లేద్సార్ అంటూ రామ్ చరణ్ చెప్పడం నవ్వులు పూయించింది. ఆఖరున బాలయ్య చరణ్ తో “సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు… తరువాత మీ నాన్నగారి సినిమా చూడు…” అని అనడమూ మరింతగా ఆకట్టుకుంది. ఇలా ఇరికించావేంటి డార్లింగ్ అంటూ ప్రభాస్ అనడమూ, వాడు షోకు వచ్చినప్పుడు నాకే ఫోన్ చేయాలి సార్ అంటూ ప్రభాస్ అడగడమూ భలేగా అలరించింది.

తరువాత గోపీచంద్ కు ఫోన్ చేయగా, ఫోన్ కట్ అయింది. ఏకంగా గోపీచంద్ అన్ స్టాపబుల్ షో లోనే ప్రత్యక్షం కావడం విశేషం! నీ సినిమాలన్నిటికీ ‘జిల్’ లుక్ బాగుంటుందని బాలయ్య అన్నారు. తరువాత తమన్నా, నయనతార పిక్స్ చూపించి, ఫారిన్ లో షాపింగ్ కు వెళ్ళాలంటే ఎవరిని తీసుకు వెళతారు అని బాలయ్య అడగడం, దానికి సరే సార్ ఇద్దరినీ తీసుకు వెళతా అని చెప్పడం, మా రెబల్ స్టార్ ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ అనడం అన్నీ గ్లింప్స్ లా చూపించారు. అంటే రాబోయే ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ ముచ్చట్లు బాగానే సాగనున్నాయనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ వన్ లో ఆరంభంలో బాలయ్య, ప్రభాస్ ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేసుకొనేలా అభినందించుకోవడం కనిపిస్తుంది. తరువాతే టాక్ షోలాగా వినోదం పంచింది. రాబోయే రెండో ఎపిసోడ్ లో ప్రభాస్ ఏ విశేషాలను పంచుకున్నారో చూద్దాం.

Show comments