ఈ ఏడాది తెలుగులో అత్యధిక చిత్రాలు విడుదలైన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఆది సాయికుమారే! జనవరి ఫస్ట్ వీక్ లో ‘అతిథి దేవో భవ’తో ఈ ఇయర్ అక్కౌంట్ ఓపెన్ చేసిన ఆది ఈ శుక్రవారం ‘టాప్ గేర్’తో క్లోజ్ చేశాడు. ఈ మధ్యలో ‘బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో’ చిత్రాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో అతని సినిమాలన్నింటిలో కాస్తంత ప్రామిసింగ్ మూవీ ఏదైనా ఉందంటే అది ‘టాప్ గేరే’! కె. శశికాంత్ దర్శకత్వంలో కె. వి. శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
అర్జున్ (ఆది సాయికుమార్) క్యాబ్ డ్రైవర్. ఆద్య (రియా సుమన్)ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. బెటర్ హాఫ్ కు బెటర్ లైఫ్ ఇవ్వాలని తపించే అర్జున్ జీవితంలోకి ఊహించని విధంగా మాదక ద్రవ్యాల ముఠా ఒకటి ప్రవేశిస్తుంది. దాంతో అతని లైఫే కాదు… ప్రెగ్నెంట్ అయిన భార్య జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. ఓ పక్క పోలీసులు, మరోపక్క డ్రగ్స్ మాఫియా అర్జున్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి అతను ఎలా బయట పడ్డాడు? తన భార్యను ఎలా కాపాడుకున్నాడు? అన్నదే ‘టాప్ గేర్’ మూవీ.
హైదరాబాద్ నుండి విదేశాలకు వెళ్ళిన డ్రగ్స్ డీలర్ సిద్ధార్థ్ (మైమ్ గోపీ) కొన్నేళ్ళ తర్వాత తిరిగి కోట్ల విలువ చేసే మాల్ కోసం హైదరాబాద్ వస్తాడు. అతని రాకను ముందే పసిగట్టిన పోలీసులు వల పన్ని అరెస్ట్ చేయాలని చూస్తారు. అయితే… తన సహచరుల సాయంతో పోలీసులకు చిక్కకుండా సిద్ధార్థ్ తప్పించుకు తిరుగుతుంటాడు. ఈ క్రమంలో అతని మాల్ చేజారిపోతుంది. డేవిడ్ అనే వ్యక్తి చేతికి ఆ మాల్ చిక్కిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ అర్జున్ ద్వారా తెలుసుకున్న సిద్ధార్థ్. మాల్ ఎలాగైనా సంపాదించిపెట్టమని, లేదంటే ఆద్యను చంపేస్తానని అర్జున్ ను బెదిరిస్తాడు. దాంతో ఆ రాత్రి అంతా… మాల్ ను ట్రేస్ చేసి, సంపాదించే పనిలో పడతాడు అర్జున్. తనకు ఏ మాత్రం సంబంధంలేని వ్యవహారంలో ఇరుక్కున్న ఓ సాధారణ క్యాబ్ డ్రైవర్ ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాడన్నది ఈ మూవీ ప్రధానాంశం.
సూటిగా, సుత్తి కొట్టకుండా డైరెక్టర్ మొదటి సీన్ లోనే థీమ్ ఇది అని చెప్పేశాడు. హీరో ఇంట్రడక్షన్ సీన్ పేరుతో టైమ్ వేస్ట్ చేయకుండా చకచకా కథలోకి వెళ్ళిపోయాడు. హీరో, హీరోయిన్ల ప్రేమ వ్యవహారం, వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం కోసం ‘వెన్నెలా వెన్నెలా… ‘ పాటను చక్కగా వినియోగించుకున్నాడు. మూవీ ప్రథమార్థం ఆసక్తికరంగా సాగింది. అయితే ఆ తర్వాత బాల్ హీరో కోర్టులో పడిన దగ్గర నుండి కథనం మందగించింది. సిటీ అవుట్ కట్స్ లో హీరో బండి అటూ ఇటూ చక్కర్లు కొడుతూనే ఉంటడంతో మూవీ గ్రాఫ్ డౌన్ అయ్యింది. ప్రీ క్లయిమాక్స్ వరకూ కథకు ముందుకు తీసుకెళ్ళకుండా దర్శకుడు నాన్చడం అంత బాగాలేదు. అయితే ‘డేవిడ్’ క్యారెక్టర్ కు సంబంధించిన కొసమెరుపుతో మళ్ళీ ఆడియెన్స్ లో ఉత్సుకత రేకెత్తింది. ఆ మధ్య వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ క్లయిమాక్స్ సీన్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ను ఇన్ ఫ్లుయెన్స్ చేస్తోంది. అదే తరహా ముగింపుతో తమ చిత్రాలకు శుభం కార్డు వేస్తున్నారు. ఇందులోనూ అదే జరిగింది. దీనికి సీక్వెల్ తీస్తారో లేదో తర్వాత సంగతి… అలా ముగించడం అనేది ఓ ప్యాషన్ గా మారిపోయింది.
క్యాబ్ డ్రైవర్ గా, భార్యను అమితంగా ప్రేమించే వ్యక్తిగా ఆది సాయికుమార్ చక్కని నటన ప్రదర్శించాడు. యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టాడు. అతని భార్యగా రియా సుమన్ బాగా నటించింది. ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంది. ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన్న మైమ్ గోపీ ఈ మధ్యలో పలు చిత్రాలలో కీలక పాత్రలను పోషించాడు. ఇందులోనూ ప్రతినాయకుడిగా నటించి, మెప్పించాడు. విశేషం ఏమంటే… నటీనటుల ఎంపికలో దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి పాత్రకూ గుర్తింపు ఉన్న వారినే ఎంపిక చేసుకున్నారు. ఇతర ప్రధాన పాత్రలను శత్రు, బ్రహ్మాజీ, ‘సత్యం’ రాజేశ్, నర్రా శ్రీను, బెనర్జీ, రవిప్రకాశ్, మిర్చి హేమంత్, చమ్మక్ చంద్ర తదితరులు పోషించారు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ మూవీకి మెయిన్ పిల్లర్స్ గా నిలిచాయి. ద్వితీయార్థం మీద కూడా కాస్తంత దృష్టి పెట్టి ఉంటే… మరింత బెటర్ మూవీ అయ్యి ఉండేది. ఆది సాయికుమార్ కెరీర్ ఈ మూవీతో ‘టాప్ గేర్’లో పడుతుందని చెప్పలేం కానీ… రివర్స్ గేర్ లోకి మాత్రం తీసుకెళ్ళదు!!
రేటింగ్: 2.5 / 5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న అంశం
తెరకెక్కించిన విధానం
ఆది, మైమ్ గోపీ నటన
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథ
నిరాశ పరిచే ద్వితీయార్థం
ఊహకందే క్లయిమాక్స్
ట్యాగ్ లైన్: గేర్ మార్చిన ఆది!