Niharika Konidela: నిహారిక కొణిదెల, వైవా హర్ష , అక్షయ్, సాయి రోనక్, భావన ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్’. అక్షయ్ పూల్ల అందించిన కథతో ఆదిత్య మందల ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 19 నుంచి ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ స్ట్రీమింగ్ ఈవెంట్ లో దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ, “ఇది యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్. ఒక్కో పాత్రకు ఒక్కో కారెక్టరైజేషన్ ఉంటుంది. జీవితంలోని ఒక్కో దశకు ఒక్కో పాత్ర ప్రతీకగా ఉంటుంది. డి.ఓ.పీ. ఫహద్ వల్లే నేను సెట్‌లో ఎంతో సరదాగా ఉండగలిగాను. నిహారిక చేసిన పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. అక్షయ్‌ను నేను పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. హర్ష లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ చేయలేను. రోనక్ ప్రతీ సీన్‌లో అద్భుతంగా నటించారు. భావన అయితే ఐశ్వర్యలానే నటించింది” అని అన్నారు.
నిహారిక మాట్లాడుతూ, “నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను నేను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేను. కానీ మా దర్శకుడు ఆదిత్య నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చారు. అక్షయ్‌కి సినిమాలు అంటే బాగా ఇష్టం. మా ఇద్దరి మధ్యే ఎక్కువ సీన్లు ఉంటాయి. హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. రోషన్ పాత్రే చాలా కష్టమని కథ విన్నప్పుడు మాకు అనిపించింది. ఆ పాత్రను రోనక్ అద్భుతంగా పోషించారు. భావనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నన్ను ఇంత అద్భుతంగా చూపించినందుకు ఫహద్ గారికి థాంక్స్. ఏ వయసు వాళ్లైనా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. కానీ యంగ్ జనరేషన్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఇకపై నటిగా, నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను” అని తెలిపింది.
సాయి రోనక్ మాట్లాడుతూ, “దర్శకుడే ప్రతీ పాత్రను పోషిస్తాడని ఆదిత్యను చూశాకే అర్థమైంది. ఓ కిస్ సీన్ లేకుండా ప్రాజెక్ట్ చేయవా? అని అడుగుతుంటారు. కానీ ఇందులో అలాంటి సీన్లు ఏమీ ఉండవు. ఇలాంటి పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో లేదో చెప్పలేం. ఈ టీంతో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉంది. నాకు నిహారికతో మళ్లీ ఓ ప్రాజెక్ట్ చేయాలని ఉంది” అని అన్నారు. అక్షయ్ మాట్లాడుతూ, “కరోనా ముందు ఎన్నో నాటకాల్లో నటించాను. ఆడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్న సమయంలోనే కరోనా వచ్చింది. రెండేళ్లు ఎగిరిపోయాయి. ఇది నా మొదటి ప్రాజెక్ట్. నేను పోషించిన భార్గవ్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది” అని అన్నారు. ఉగాది పచ్చడిలా ఈ వెబ్ సీరిస్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని వైవా హర్ష తెలిపారు. దీనికి సీజన్ 2 కూడా త్వరలోనే ఉంటుందని కెమెరామెన్ ఫహద్ చెప్పారు.