Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్‌కి సౌత్ ఇండియాలో అవధులు లేవు. ‘పుష్ప’ లాంటి బ్లాక్ బస్టర్ తో తన పాపులారిటీని ఉత్తరభారతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేశాడు అల్లు అర్జున్. అభిమానులు అతన్ని ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’ అని పిలుచుకుంటారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్‌లైన్‌లో విడుదలైతే చాలు అగ్రస్థానంలో ఉంటుంది. అంతేకాదు, పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో కూడా భారీగా వైరల్ అవుతుంటుంది. ఇదిలా ఉంటే… సోషల్ మీడియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు అల్లు అర్జున్. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉండటం ద్వారా 20 మిలియన్స్ మైలురాయిని సాధించిన తొలి దక్షిణ భారత నటుడు గా రికార్డ్ సాధించాడు.
అల్లు అర్జున్ ఇటు ఫామిలీకి అటు అభిమానులకి చాలా విలువనిస్తాడు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. తన భార్య స్నేహ, పిల్లలు అయాన్ అర్హాతో ఉన్న చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. దాంతో అభిమానులంతా అర్జున్ పెట్టే పోస్టింగ్స్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సీక్వెల్ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు.