Tom Cruise: టామ్ క్రూజ్.. గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. హాలీవుడ్ హీరోగా పరిచయమైన టామ్ అందరికి సుపరిచితుడే. ఇక ఆయన చేసిన స్టంట్స్ మరెవ్వరు చేయలేరేమో అంటే అతిశయోక్తి కాదు. గాల్లో విన్యాసాలు, బైక్ లపై, విమానాలతో టామ్ స్టంట్స్ కు ఫిదా అయిపోని యాక్షన్ లవర్ ఉండడు. ఇక త్వరలోనే ఈ హీరో అంతరిక్షంలో షూటింగ్ చేసే పనుల్లో నిమగ్నమయినట్లు తెలుస్తోంది. ప్రసుత్తం టామ్.. టాప్ గన్ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా ముందు మొదలైన ఈ సినిమాకు డగ్ లిమాన్ దర్శకత్వం వహిస్తుండగా యూనివర్సల్ పిక్చర్స్ అధినేత డోనా లాంగ్లీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమా కోసం ఎవ్వరు చేయని సాహసం టామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో స్పేస్ వాక్ చేయడానికి సిద్దమయ్యాడట.. ఇందుకోసం యూనివర్సల్ ఫిల్మ్డ్ ఎంటర్ టైన్ మెంట్ గ్రూప్ ని సంప్రదించినట్లు కథనాలొస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. అంతరిక్షంలో షూటింగ్ చేసిన మొదటి మగాడు.. మొనగాడు టామ్ క్రూజే అవుతాడు. ఈ చిత్రానికి దాదాపు 200 మిలియన్ల డాలర్ల ఖర్చవుతుందని టాక్ నడుస్తోంది. ఇంకా పూర్తి బడ్జెట్ ను మేకర్స్ డిసైడ్ చేయలేదని తెలుస్తోంది. మరి త్వరలోనే ఈ వార్త అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.