చిత్రమైన చిత్రజగతిలో ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు! అందాలభామ జెన్నీఫర్ లోపెజ్, ఆమె మొగుడు బెన్ అఫ్లెక్ కథ చూస్తే అలాగే అనిపిస్తుంది. వీరిద్దరూ 2002 నుండి 2004 వరకు డేటింగ్ చేశారు. ఆ తరువాత విడిపోయారు. ఆ రోజుల్లో అమెరికాలోని అనేక సినిమా మేగజైన్స్ వారిద్దరి ఫోటోలతో నిండిపోయాయి. అంతలా జెన్నీఫర్- బెన్ జోడీ ప్రేమయాత్రలు చేసింది. తరువాత 2005లో బెన్ అఫ్లెక్, జేలోకు టాటా చెప్పేసి జెన్నీఫర్ గార్నర్ ను పెళ్ళాడాడు. ఆమెతో దాదాపు పదమూడేళ్ళు కాపురం చేశాక, 2018లో విడాకులు తీసుకున్నాడు. ఈలోగా జెన్నీఫర్ లోపెజ్ కూడా 2004 నుండి 2014 వరకు సింగర్ మార్క్ ఆంటోనీతో కాపురం చేసింది. ఏమయిందో ఏమో? ఏమనుకున్నారో ఏమో? కానీ, జెన్నీఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ మళ్ళీ 2021లో కలుసుకున్నారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నవారే కాబట్టి, ఈ సారి ఆలస్యం చేయకుండా పెళ్ళాడేశారు.
ఈ కథంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే – ఇప్పుడు జెన్నీఫర్ లోపెజ్ నటించిన ‘ద మదర్’ అనే సినిమా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది. అందులో జె.లో. యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. దాంతో ఆమె పతిదేవుడు బెన్ అఫ్లెక్ అదేపనిగా ‘ద మదర్’ సినిమాను ప్రతి ఒక్క మహిళ చూసి తీరవలసిందేనని, ఇక జె.లో.నటన ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ లేనివిధంగా ఆకట్టుకుంటోందని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. మే 12న ‘ద మదర్’ జనం ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమాను చూసేద్దామా అన్న ఆసక్తిగా ఉన్నానని బెన్ అంటున్నాడు. పెళ్ళాంకు డబ్బా కొట్టడమంటే ఇదే అంటూ హాలీవుడ్ జనం నవ్వుకుంటున్నారు.