NTV Telugu Site icon

జోరుగా హుషారుగా… రాశీ ఖన్నా!

raashi khanna

raashi khanna

ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ తెలుగువారిని భలేగా ఆకట్టుకుంటోంది ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసిందీ ముద్దుగుమ్మ. కేవలం నటనతోనే కాకుండా తన గళంతోనూ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఆరంభంలో బరువు దరువుతో అలరించిన రాశీ ఖన్నా, ఇప్పుడు నాజూకు సోకులు సొంతం చేసుకొని మరింతగా ఆకర్షిస్తోంది. దక్షిణాది చిత్రాలతోనే ఈ ఉత్తరాది అందం మెరిసిపోవడం విశేషం!

రాశీ ఖన్నా 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించింది. అక్కడే లేడీస్ శ్రీరామ్ కాలేజ్ లో బి.ఏ. ఇంగ్లిష్ లో ఆనర్స్ చేసింది. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంది. అందుకోసం తపించింది. చిత్రంగా మోడలింగ్ లో అడుగు పెట్టింది. ఆ తరువాత సినిమా రంగంపై మనసు పారేసుకుంది. ఇవన్నీ అనుకోకుండా జరిగిపోయాయని అంటుందామె. జాన్ అబ్రహామ్ నిర్మించి, నటించిన పొలిటికల్ స్పై థ్రిల్లర్ ‘మద్రాస్ కేఫ్’తో తొలిసారి తెరపై మెరిసింది రాశీ ఖన్నా. తరువాత అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అందరూ నటించిన ‘మనం’లో కాసేపు తళుక్కు మంది. నాగశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో తొలిసారి నాయికగా నటించింది రాశీ ఖన్నా. సందీప్ కిషన్ ‘జోరు’లోనూ హీరోయిన్ గా కనువిందు చేసింది. ఇందులో మరో మెట్టు ఎక్కి గాయనిగానూ తన గళం వినిపించింది.

“జిల్, శివమ్, బెంగాల్ టైగర్” చిత్రాలలో నటించేసి మురిపించింది రాశీ ఖన్నా. సాయిధరమ్ తేజ్ తో నటించిన ‘సుప్రీమ్’ మంచి ఆదరణ చూరగొంది. అదే సమయంలో జూనియర్ యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’లో పెళ్ళిళ్ళ పేరమ్మ ప్రియ పాత్రలో భలేగా ఆకట్టుకుంది రాశి. రవితేజ ‘రాజా ది గ్రేట్’ తో రాశి జనానికి మరింత చేరువయింది. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’లో నటించేసి, యువతను అలరించింది. తమిళంలో “ఇమైక్కా నోడిగల్, అడంగ మరు” చిత్రాలతో రాశీ ఖన్నా మరింత పేరు సంపాదించింది. ఓ వైపు తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు మళయాళ సీమ బాట కూడా పట్టింది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ తో కలసి ‘పక్కా కమర్షియల్’లో నటిస్తోంది రాశి. ఇక నాగచైతన్య సరసన ‘థ్యాంకు యూ’లోనూ మురిపించనుంది. ఈ రెండు తెలుగు చిత్రాలతో పాటు నాలుగు తమిళ చిత్రాల్లో రాశీ ఖన్నా నటిస్తోంది.

రాశీ ఖన్నా ఇప్పటి దాకా ఆరు చిత్రాలలో గాయనిగా గళం విప్పగా, అందులో ఐదు సినిమాలు తెలుగువే కావడం విశేషం. నటిగా, గాయనిగా తనదైన పంథాలో పయనిస్తోన్న రాశీ ఖన్నా మునుముందు ప్రేక్షకులను ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.