Site icon NTV Telugu

న‌ట‌న‌లో స్పైడ‌ర్ మేన్ పాత్ర‌ధారి పాట్లు!

spider man

spider man

వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న స్పైడ‌ర్ మేన్ : నో వే హోమ్ సినిమా చూస్తే చాలు హీరో టామ్ హాలాండ్ కు క‌నెక్ట్ కాకుండా ఉండ‌లేరు. పాతికేళ్ళ ఈ న‌ట‌కిశోరం అప్పుడే వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. స్పైడ‌ర్ మేన్ : నో వే హోమ్ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అన్ చార్టెడ్ చిత్రాన్ని అంగీక‌రించాడు. కోవిడ్ కార‌ణంగా షూటింగ్ కు అంత‌రాయం క‌ల‌గ‌డం, త‌రువాత అన్ చార్టెడ్లో న‌టించి, మ‌ళ్ళీ స్పైడ‌ర్ మేన్ : నో వే హోమ్లో న‌టించ‌డానికి అబ్బాయిగారు కాస్త ఇబ్బంది ప‌డ్డార‌నే చెప్పాలి. నిజానికి స్పైడ‌ర్ మేన్ వాకింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అలాగే అన్ చార్టెడ్లో టామ్ పోషిస్తున్న నాద‌న్ డ్రేక్ పాత్ర వేరుగా ఉంటుంది. ఆ సినిమాలో న‌టించి, మ‌ళ్ళీ స్పైడ‌ర్ మేన్లోని పీట‌ర్ పార్క‌ర్ పాత్ర‌లో న‌టించ‌డానికి వెళ్ళాడ‌ట టామ్. అత‌ను మామూలుగా న‌డ‌వ‌డం చూసి, అరె నువ్వు మామూలు మ‌నిషిలా న‌డుస్తున్నావే.. అంటూ స్పైడ‌ర్ మేన్ యూనిట్ మెంబ‌ర్స్ అన్నార‌ట‌. అప్పుడు త‌న‌ను తాను చూసుకున్నాక‌, మ‌ళ్ళీ స్పైడ‌ర్ మేన్ న‌డ‌క ప్రాక్టిస్ చేయ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. ఈ ముచ్చ‌ట్ల‌న్నీ త‌ల‌చుకొని పొంగిపోతున్నాడు టామ్ హాలాండ్. అంతే కాదు అన్ చార్టెడ్ సినిమాలోని నాద‌న్ డ్రేక్ పాత్ర కోసం 74 కిలోల బ‌రువు పెర‌గాల్సి వ‌చ్చింద‌ట‌. ఆ సినిమా అయ్యాక మ‌ళ్ళీ స్పైడ‌ర్ మేన్ లో న‌టించ‌డానికి పాత్ర‌కు అనుగుణంగా 66 కిలోలు రావ‌డానికి నానా తంటాలు ప‌డ్డాన‌ని గుర్తుచేసుకుంటున్నాడు టామ్. ఇక స్వ‌త‌హాగా త‌న వ్య‌క్తిత్వానికి పూర్తి భిన్న‌మైన పాత్ర అన్ చార్టెడ్లో పోషిస్తున్న నాద‌న్ డ్రేక్ పాత్ర ఉంటుంద‌ని చెబుతున్నాడు టామ్.

నాద‌న్ ఎంతో కూల్ గా ఉండే కేరెక్ట‌ర్ అట‌! కానీ, టామ్ అందుకు పూర్తి విరుద్ధ‌మ‌ని త‌న‌కు తానే మురిసిపోతూ చెబుతున్నాడు. ఏది ఏమైనా, ఈ రెండు సినిమాల‌తోనే త‌న‌లోని అస‌లైన న‌టుడు బ‌య‌ట ప‌డ్డాడ‌ని అంటున్నాడు టామ్. మ‌రి న‌ట‌నంటే మాట‌లా!? ఎంత‌గా శ్ర‌మించాలి. మ‌రెంత‌గా బ‌రువుపై ద‌రువులు వేస్తూ ఉండాలి. ఇలా క‌ష్ట‌ప‌డితేనే కానీ, ఫ‌లితం ద‌క్క‌ద‌నీ టామ్ అంటున్నాడు. అంటే పాతికేళ్ల వ‌య‌సుకే పెద్ద ఆరిందాలా జీవితాన్ని వ‌డ‌పోసిన‌ట్టు మాట్లాడేస్తున్నాడు. ప్ర‌స్తుతం అన్ చార్టెడ్ విడుద‌ల‌కు ముస్తాబ‌యింది. ఫిబ్ర‌వ‌రి 11న ముందుగా యునైటెడ్ కింగ్ డ‌మ్ లోనూ ఆ త‌రువాత ఫిబ్ర‌వ‌రి 18న అమెరికాతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మ‌రి స్పైడ‌ర్ మేన్ గా అల‌రించిన టామ్ హోలాండ్ అన్ చార్టెడ్లో ఏ తీరున ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

Exit mobile version