‘బేవార్స్’, ‘సోదర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సంజోష్.. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తన ఉదారతను చాటుకుంటున్నారు. ఆయన నేతృత్వంలోని ‘సంజోష్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఇటీవల ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఘనంగా స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాగిన ఈ అద్భుత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలోని గిరిజన, దిగువ మధ్యతరగతి తరగతులకు చెందిన ప్రతిభావంతులైన 118 మంది విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్‌షిప్‌లు హీరో సంజోష్ అందజేశారు. 10వ తరగతిలో 500కు పైగా మార్కులు, ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. ఎంపికైన 118 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నగదు స్కాలర్‌షిప్‌లను అందజేసి వారి తదుపరి చదువులకు కొండంత భరోసానిచ్చారు.
ఈ వేడుకకు ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా కష్టపడి చదివి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్, ఐపీఎస్ పూజారి నాగేశ్వరరావు, డీఈఓ సిద్ధార్థ్ రెడ్డి, ఎంఈఓ మల్లిక్ తదితర ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు పాల్గొని హీరో సంజోష్ చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు.
హీరో సంజోష్ కేవలం చదువుకే పరిమితం కాకుండా.. గిరిజన ప్రాంతాల్లో పలు రకాల సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గతంలో గిరిజన ప్రాంతాల ప్రజల కోసం 168 ఉచిత మొబైల్ కంటి క్యాటరాక్ట్ (శుక్లాల) శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయించారు. పేద విద్యార్థులకు అవసరమైన టైలు, బెల్ట్లు, షూస్ సహా ఎగ్జామ్ కిట్లను ఉచితంగా అందజేశారు. ముగ్గురు పేద విద్యార్థుల పూర్తి చదువు బాధ్యతలను వ్యక్తిగతంగా స్వీకరించి, వారికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. సినిమాల్లో ఎదుగుతూనే, మరోవైపు సమాజం పట్ల బాధ్యతగా మెలుగుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంజోష్ సేవా గుణాన్ని గిరిజన ప్రాంత ప్రజలతో పాటు సినీ ప్రముఖులు సైతం కొనియాడుతున్నారు.
