మణిరత్నం మేగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం తెలుగునాట అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏప్రిల్ 28న ‘పొన్నియిన్ సెల్వన్’ రెండవ భాగం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో “ఫస్ట్ పార్ట్ లో కేవలం పాత్రల పరిచయం జరిగింది. అసలు కథ రెండో భాగంలోనే ఉంది” అంటూ మణిరత్నం సెలవిచ్చారు. దాంతో ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 2 ప్రదర్శన సమయం మూడు గంటలకు పైగా ఉందనే పుకారు షికారు చేస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్ 167 నిమిషాలు అంటే రెండు గంటల నలభై ఏడు నిమిషాల ప్రదర్శన సమయం ఉంది. అయితే ఇప్పుడు తేలిందేమంటే – తొలి భాగం కంటే పది నిమిషాల తక్కువ సమయంతోనే రెండో భాగం విడుదల కానుందని. అంటే ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ ప్రదర్శన సమయం 157 నిమిషాలేనట! అంటే రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలతోనే సినిమా జనం ముందుకు రాబోతోందని తెలుస్తోంది.
‘పొన్నియిన్ సెల్వన్-2’ సినిమాలో ప్రథమార్ధం 79 నిమిషాలు అంటే 1 గంట 19 నిమిషాలు, ద్వితీయార్ధం 78 నిమిషాలు అనగా 1 గంట 18 నిమిషాలు ఉంటుందని సమాచారం. అంతా బాగానే ఉంది. కానీ, కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రక నవల ఆధారంగా రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్’లో రాజరాజ చోళుని కథ ఇంకా ఎంతో ఉందని, దాని కోసం మరో భాగం తీస్తారా? అన్న ప్రశ్నకూడా ఉదయిస్తోంది. అయితే అలాంటి యోచన ఏమీ లేదనీ తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్ తరువాతి రోజుల్లో రాజరాజచోళునిగా సుప్రసిద్ధుడైనాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో, కళలతో అలరారినట్టు చరిత్ర చెబుతోంది. అదంతా కూడా ఇంతకు ముందే శివాజీగణేశన్ తో ఎ.పి.నాగరాజన్ 1973లో తెరకెక్కించిన ‘రాజరాజ చోళన్’లోనే ఉందట! అందువల్ల మరో సీక్వెల్ కు ఆస్కారం లేదని అంటున్నారు. ఏది ఏమైనా తమిళుల తొలి సినిమాస్కోప్ గా విడుదలై అలరించిన ‘రాజరాజ చోళన్’ వచ్చిన యాభై ఏళ్ళకు రాజరాజచోళుని కథకు ముందు భాగంగా ‘పొన్నియిన్ సెల్వన్-2’ రావడం విశేషమే! మరి ఏప్రిల్ 28న ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగం ఏ తీరున ఆకట్టుకుంటుందో చూడాలి.