ప్రముఖ సింగర్ సంగీత దారుణ హత్యకు గురవడం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత(29) గత వారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మే 11 న కనిపించకుండా పోయిన ఆమె మూడురోజుల తరువాత శవంగా కనిపించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారం చేపట్టి నిందితులను అరెస్ట్ చేసారు. ఈ విచారణలో సంచలన నిజం బయటపడడం మరింత హాట్ టాపిక్ గా మారింది. దివ్య దగ్గర పనిచేసే రవి, అనిల్ అనే వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విచారణలో నిందితులు, దివ్యను ఎలా చంపారో వివరించారు.
“ప్లాన్ ప్రకారమే దివ్యను హత్య చేశాం.నేను చెప్పినట్లు అనిల్ ఢిల్లీకి వచ్చి ఆమెను తనతో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో చెరుకు రసంలో 10 నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు. హర్యానాలోని కలనౌర్ దగ్గరికి రాగానే నేను వారిని కలిశాను. ఆ తర్వాత ముగ్గురం కలిసి అక్కడే సమీపంలోని గులాటి దాభాలో భోజనం చేసాం. అక్కడ నుంచి కారులో ఆమెను తీసుకెళ్తూ గొంతు నులిమి చంపేశాం. అనంతరం మొహం దగ్గర ఒక నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టాం” అని చెప్పుకొచ్చారు. అయితే రవి తో, దివ్య రిలేషన్ లో ఉందని, ఇటీవల వారి మధ్య విబేధాలు రావడంతో రవి ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.