NTV Telugu Site icon

AHA: లాస్యప్రియ గాత్రానికి హరీశ్ రావు ఫిదా!

Aha

Aha

Lasya Priya: ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ -2 విజయవంతంగా సాగుతోంది. ఇందులోని కంటెస్టెంట్స్ ప్రతిభకు సినీ, సంగీత రంగాలకు చెందిన వారే కాదు… రాజకీయ నేతలూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండియన్ ఐడల్ -2లో సిద్ధిపేటకు చెందిన లాస్య ప్రియ చక్కటి గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె గానానికి తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు సైతం ఫిదా అయిపోయారు. ఇటీవల ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2లో పార్టిసిపేట్‌ చేసే లాస్యప్రియ ప్రతిభ గురించి రాశారు. ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’లో అత్యంత ప్రతిభను చూడటం చాలా ఆనందంగా అనిపించింది. లాస్యప్రియ గళం నా చెవుల్లో మారుమోగుతోంది. ఆమె భవిష్యత్‌ ప్రణాళికలన్నీ సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని ట్వీట్‌ చేశారు హరీష్‌ రావు. ప్రజాదరణ పొందిన, ప్రజల మనసులకు దగ్గరైన తెలుగు పాటలను హృద్యంగా ఆలపిస్తూ సంగీతప్రియుల అభిమానాన్ని అందుకుంటోంది లాస్యప్రియ. ఇప్పుడున్న ఎనిమిది మంది కంటెస్టంట్లలో ఆమె ఒకరు. లాస్యప్రియ పెర్ఫార్మెన్స్ మెచ్చి న్యాయ నిర్ణేతలు ఎప్పటికప్పుడు అభినందనలు చెబుతూనే ఉన్నారు. శ్రోతల్లోనూ ఆమె గళానికి ముగ్దులవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.