(ఫిబ్రవరి 4న శేఖర్ కమ్ముల పుట్టినరోజు)
దర్శకుడు శేఖర్ కమ్ములను చూడగానే బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనిపిస్తుంది. ఆయన కదలికలు చూస్తే కొండొకచో నవ్వులూ పూస్తాయి. ఇప్పటి దాకా శేఖర్ రూపొందించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా, ఆయన ఆకట్టున తీరు ఎక్కువే అనిపిస్తుంది. తాను రాసుకొనే కథల్లో సగటు ప్రేక్షకునికి ఏమి కావాలో స్పష్టంగా తెలిసి మరీ వాటిని సినిమాలో చొప్పిస్తారు.
కాఫీ తాగని వారిచేత కూడా తన సినిమాల ద్వారా ‘మంచి కాఫీ తాగిన ఫీలింగ్’ కలిగిస్తూ ఉంటారు శేఖర్.
శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించారు. అయితే పెరిగి పెద్దయి, చదువుసంధ్యలు సూర్తి చేసుకున్నదంతా హైదరాబాద్ లోనే. అందువల్లే అతని మాటల్లో హైదరాబాద్ తెలుగు తకధిమితై అంటూ నాట్యం చేస్తూ ఉంటుంది. 2000లో డాలర్ డ్రీమ్స్
చిత్రం రూపొందించి, అందరినీ తనవైపు తిప్పుకున్నారు శేఖర్. ఈ సినిమాతో ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా జాతీయ స్థాయిలో అవార్డు సంపాదించారు. ఆ తరువాత ఆనంద్
తో జనానికి చేరువయ్యారు. గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ
ఇలా తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగారు శేఖర్.
నవతరం ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే కథాంశాలతో శేఖర్ కమ్ముల చిత్రాలు ఉంటాయి. మన చుట్టూ, నిత్యం మనకు తారసపడే అంశాలతోనే శేఖర్ తన సినిమాలకు కథలు రూపొందిస్తూ ఉంటారు. అందుకే చూసేవారిని ఆయన కథలు ఇట్టే పట్టేస్తాయి. శేఖర్ ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య గ్యాప్ బాగా ఉంటుంది. అయినా, తన ప్రతి చిత్రంతో జనాన్ని ఆకర్షిస్తూ ఉండడమే శేఖర్ స్పెషాలిటీ. ప్రస్తుతం అందరు దర్శకుల లక్ష్యం యువతను ఆకట్టుకోవడమే. శేఖర్ కథల్లో యువతను ఆకర్షించే అంశాలు బోలెడు ఉంటాయి. అలాగని అతను ఏ నాడూ అశ్లీలానికి, అసభ్యతకు తావిచ్చింది లేదు. శేఖర్ సినిమాలను నిరభ్యంతరంగా సకుటుంబసమేతంగా చూడవచ్చునని ప్రేక్షకుల విశ్వాసం. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూనే శేఖర్ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు. ఆయన చిత్రాల్లో సహజత్వానికీ పెద్ద పీట వేస్తూంటారు. అలాగని ఆయన సినిమాల్లో పాటలు గట్రా ఉండవనీ కాదు. ఆ పాటల్లోనూ జనానికి సహజత్వం కనిపించేలా జాగ్రత్త పడతారు. అదే శేఖర్ ను నేటి దర్శకుల్లో ప్రత్యేకంగా నిలుపుతోంది. లవ్ స్టోరీ
తో పర్లేదు అనిపించుకున్న శేఖర్ తరువాత ఏ సినిమాతో జనం ముందుకు వస్తారో చూడాలి.