(అక్టోబర్ 14న పి.చంద్రశేఖర రెడ్డి బర్త్ డే)
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలను రూపొందించడంలో మేటి అనిపించుకున్నారు పి.చంద్రశేఖర రెడ్డి. ఆయన చిత్రాల నిండా ఫ్యామిలీ సెంటిమెంట్ సెంటులా సువాసనలు వెదజల్లేది. చంద్రశేఖర రెడ్డి తన చిత్రాలలో కథనాన్ని నడిపిన తీరును ఆ తరువాత ఎంతోమంది అనుసరించడం గమనార్హం! హీరో కృష్ణను స్టార్ గా నిలపడంలోనూ చంద్రశేఖర రెడ్డి చిత్రాలు భలేగా పనిచేశాయి. కొన్ని యాక్షన్ మూవీస్ సైతం చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కినా, ఆయన పేరు వినగానే ఇప్పటికీ ఆ నాటి సినిమా అభిమానులకు ఆయన తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామాసే గుర్తుకు వస్తుంటాయి.
పి.సి.రెడ్డిగా చిత్రసీమలో పేరొందిన ఆయన పూర్తి పేరు పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి. నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం పేటలో 1933 అక్టోబర్ 14న జన్మించారు. ఆయన తండ్రి వారి ఊరికి మునసబుగా పనిచేశారు. మూడో క్లాస్ దాకా సొంతవూరులో చదువుకొని ఆ తరువాత మద్రాసు చేరి అక్కడే విద్యను అభ్యసించారు. పచ్చయప్ప కళాశాలలో బి.ఏ. పూర్తి చేశారు. నటుడు వల్లం నరసింహారావు పరిచయమయింది. అది కాస్తా స్నేహంగా మారింది. ఆయన ప్రోత్సాహంతోనే 1960లో రూపొందిన ‘శ్రీకృష్ణరాయబారం’ చిత్రానికి డైరెక్టర్ ఎన్.జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ సినిమాలో రఘురామయ్య శ్రీకృష్ణ పాత్ర ధరించారు. ఇందులో తిరుపతి వేంకటకవులు రాసిన 48 పద్యాలు ఉపయోగించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఈ చిత్రం రికార్డులు ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొన్నాయి. తరువాత దర్శకుడు వి.మధుసూదనరావు వద్ద 11 సంవత్సరాలు అసిస్టెంట్ గా, అసోసియేట్ గా, కో-డైరెక్టర్ గా పనిచేశారు పి.సి.రెడ్డి. ఆదుర్తి సుబ్బారావు వద్ద ‘పూలరంగడు’ చిత్రానికి కో-డైరెక్టర్ గా ఉన్నారు. ఆ పై 1971లో కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన ‘అనూరాధ’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు పి.సి.రెడ్డి. అయితే ఈ సినిమా కంటే ముందుగా కృష్ణ, వాణిశ్రీతో ఆయన తెరకెక్కించిన ‘అత్తలూ-కోడళ్ళు’ చిత్రం విడుదలయింది. శోభన్ బాబుతో రూపొందించిన ‘విచిత్రదాంపత్యం’ కూడా అదే సమయంలో వెలుగు చూసింది. ఆ తరువాతే ‘అనూరాధ’ జనం ముందు నిలచింది. ఈ మూడు చిత్రాలు దర్శకునిగా పి.సి.రెడ్డికి మంచి పేరు సంపాదించి పెట్టాయి. కృష్ణ, వాణిశ్రీతో పి.సి.రెడ్డి రూపొందించిన ‘ఇల్లు-ఇల్లాలు’ మంచి విజయం సాధించింది. దాంతో మహానటుడు యన్టీఆర్ తో ‘బడిపంతులు’ చిత్రం రూపొందించే అవకాశం దక్కింది. ‘బడిపంతులు’ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా యన్టీఆర్ కు ఉత్తమనటునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది.
రామారావుతో హిట్ చూసినా, ఎందుకనో పి.సి.రెడ్డి ఆ తరువాత ఆయనతో సినిమాలు తెరకెక్కించలేకపోయారు. అలాగే ఏయన్నార్ తోనూ పి.సి.రెడ్డి ఒకే చిత్రం ‘తాండవకృష్ణుడు’ రూపొందించారు. తనకు దొరికిన సినిమాలతోనే సంతృప్తి చెందారు. పైగా అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వర్ధమాన కథానాయకుల చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా సాగారు పి.సి.రెడ్డి. శోభన్ బాబుతో పి.సి.రెడ్డి తెరకెక్కించిన ‘మానవుడు-దానవుడు’ మంచి విజయం సాధించింది. తరువాత శోభన్ బాబుతో “నాయుడుబావ, మానవుడు-మహనీయుడు” వంటి చిత్రాలు రూపొందించారు. కృష్ణంరాజుతో “పుట్టింటి గౌరవం, ఒకే రక్తం, రాముడు-రంగడు, జగ్గు” వంటి చిత్రాలు తెరకెక్కించారు పి.సి.రెడ్డి. మాదాల రంగారావు నిర్మించి, నటించిన ‘నవోదయం’ చిత్రం ఆయన దర్శకత్వంలో వెలుగు చూసింది.
పి.సి.రెడ్డి ఎందరితో సినిమాలు రూపొందించినా, ఆయనకు కృష్ణ కాంపౌండ్ డైరెక్టర్ అనే ముద్ర పడింది. అయినా, అందరి అభిమానం సంపాదించుకుంటూ సాగారు రెడ్డి. కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో “అత్తలు- కోడళ్ళు, అనూరాధ, ఇల్లు-ఇల్లాలు, తల్లీకొడుకులు, మమత, స్నేహబంధం, గౌరి, పెద్దలు మారాలి, కొత్తకాపురం, సౌభాగ్యవతి, పాడిపంటలు, జన్మజన్మల బంధం, పట్నవాసం, ముత్తయిదువ, భోగభాగ్యాలు, పగబట్టిన సింహం, బంగారుభూమి, పులిజూదం, నా పిలుపే ప్రభంజనం, ముద్దుబిడ్డ” చిత్రాలు రూపొందాయి. కృష్ణ హీరోగా మొత్తం 20 చిత్రాలు తెరకెక్కించారు పి.సి.రెడ్డి. కృష్ణ హీరోగా రూపొందిన ‘అత్తలూ-కోడళ్ళు’తోనే దర్శకునిగా పి.చంద్రశేఖర రెడ్డి తొలిసారి తెరపై పేరు చూసుకున్నారు. అలా తనకు అచ్చివచ్చిన హీరో అని పి.సి.రెడ్డి సైతం భావించారు. ‘అల్లూరి సీతారామరాజు’ తరువాత కృష్ణ వరుసగా ఓ డజన్ ఫ్లాపులు చూశారు. ఆ సమయంలో పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాడిపంటలు’ 1976లో సంక్రాంతి కానుకగా వచ్చి విజయకేతనం ఎగురవేసింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి కృష్ణ సినిమా విడుదల కావడం ఓ సంప్రదాయంగా మారింది. అలా దాదాపు పాతకేళ్ళు పొంగల్ బరిలో కృష్ణ సినిమా విడుదలవుతూ వచ్చింది. కృష్ణ, శ్రీదేవితో పి.సి.రెడ్డి రూపొందించిన ‘బంగారుభూమి’ కూడా సంక్రాంతి కానుకగా వచ్చి సందడి చేసినదే. పి.సి.రెడ్డి రూపొందించిన ‘ప్రళయగర్జన’ చిత్రంతోనే రాజ్-కోటి సంగీత ప్రయాణం మొదలు పెట్టడం విశేషం.
పి.సి.రెడ్డికి 1993 తరువాత సినిమాలు తగ్గాయి. అయితే టీవీ సీరియల్స్ రూపొందించారు. 2014లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ‘జగన్నాయకుడు’ అనే సినిమాను రూపొందించారు. ఇందులో రాజా హీరోగా నటించారు. ఈ సినిమా ఆట్టే ఆకట్టుకోలేక పోయింది. చంద్రశేఖర రెడ్డి వద్ద పనిచేసిన అసోసియేట్స్ కూడా తరువాతి రోజుల్లో తమదైన బాణీ పలికించారు. ఆయన వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.యన్.రామచంద్రరావు, శరత్, వై. నాగేశ్వరరావు వంటివారు దర్శకులుగా రాణించారు. పి.సి.రెడ్డి మరిన్ని వసంతాలు చూస్తూ హాయిగా సాగాలని ఆశిద్దాం.