(జనవరి 28న శ్రుతి హాసన్ పుట్టినరోజు)
అపజయాలకు వెరవకుండా, విజయాలకు అదే పనిగా మెరవకుండా ఉండడమే శ్రుతి హాసన్ నైజం. అందుకే అమ్మడు జయాపజయాలను సమానంగా చూసింది. ఫ్లాపులు పలకరిస్తున్న సమయంలోనే విజయం ఆమె తలుపు తట్టింది. అదే తీరున పరాజయాలు చుట్టుముట్టగా మళ్ళీ ‘క్రాక్’తో కేక పుట్టించింది. తరువాత వకీల్ సాబ్
తోనూ సందడి చేసింది. ఈ రెండు సినిమాల తరువాత శ్రుతి కెరీర్ లోనే ఓ అపురూపంగా నటసింహం నందమూరి బాలకృష్ణతో నటించే అవకాశం దక్కించుకుంది శ్రుతి. తన తండ్రి తరం హీరో అయిన బాలకృష్ణతో శ్రుతి నటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.
శ్రుతి హాసన్ 1986 జనవరి 28న జన్మించింది. తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక. తల్లిదండ్రులు ఇద్దరూ మేటి నటులు. కమల్ ఉలగ నాయగన్
గా జేజేలు అందుకుంటూ ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తున్నారు. ఇక సారిక ఒకప్పుడు అందాల తారగా జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. వారి వారసురాలుగా శ్రుతి హాసన్ బాలనటిగానే హే రామ్
లో భళా అనిపించింది. తండ్రి కమల్ హాసన్ లాగే తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ గాయనిగా, మ్యూజిక్ కంపోజర్ గా కూడా అలరించింది. తన తండ్రి ‘ఈనాడు’ సినిమాకు ప్రచార గీతంలో గళం విప్పిన శ్రుతి ఆ తరువాత “ఓ మై ఫ్రెండ్, త్రీ, రేసుగుర్రం, ఆగడు” చిత్రాల్లోనూ తెలుగు పాటలు పాడి అలరించింది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కు కంపోజర్ గానూ పనిచేసింది.
అనగనగా ఓ ధీరుడు
తో తెలుగు వారి ముందు నాయికగా నిలచిన శ్రుతికి ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అప్పట్లో అందరూ ఆమెను ఐరన్ లెగ్
అనీ అన్నారు. సరిగా అప్పుడు పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్
లో నాయికగా నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. శ్రుతి హాసన్ కెరీర్ లో తొలి బిగ్ హిట్ ‘గబ్బర్ సింగ్’. అప్పటి దాకా శ్రుతికి ఉన్న ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర చెరిగిపోయింది. దాంతో ‘గోల్డెన్ లెగ్’గానూ మారింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో శ్రుతి హాసన్ హంగామా చేసింది. కొన్ని విజయాలు, మళ్ళీ పరాజయాలు. ఆమె కెరీర్ గ్రాప్ లో పలు అప్స్ అండ్ డౌన్స్ . గత యేడాది క్రాక్, వకీల్ సాబ్
రెండూ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సరసన తొలిసారి నటిస్తోంది. ఈ సినిమావైపు అందరూ ఆసక్తిగా దృష్టి సారించారు. ఎందుకంటే, బాలయ్య లాంటి టాప్ హీరోతో శ్రుతి ఏ తరహా విజయాన్ని అందుకుంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ప్రభాస్ తో సలార్
లో నాయికగా మురిపించనుంది. ఈ ప్యాన్ ఇండియా మూవీతో శ్రుతి ఏ తీరున మురిపిస్తుందో చూడాలనీ జనం ఆత్రం.
తన బహుముఖ ప్రజ్ఞతో సాగిన శ్రుతి హాసన్ సినిమా కెరీర్ లోనే కాదు, ఆమె రియల్ లైఫ్ లోనూ పలు మలుపులు ఉన్నాయి. అప్పట్లో హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం సాగించింది. తరువాత మైఖేల్ కోర్సేల్ అనే విదేశీ నటునితోనూ ప్రేమయాత్రలు చేసింది. అతనితో తెగతెంపులు చేసుకున్నానని ఆ మధ్య ప్రకటించింది. ఇంతకూ ఇప్పుడు సింగిలా లేక ఎవరైనా పార్ట్ నర్ ఉన్నాడా అన్న ప్రశ్నకు “మీరు ఏమనుకుంటే అదే” అంటూ చమత్కారంగా సమాధానమిచ్చింది శ్రుతి. ఏది ఏమైనా తన రూటే సెపరేటు అంటూ సాగుతోంది శ్రుతి హాసన్. ఈ పుట్టినరోజు తరువాత శ్రుతి హాసన్ మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకుంటారేమో చూడాలి.