క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ,. యంగ్ హీరో తేజ సజ్జా కలయికలో తెరకెక్కిన సినిమా హనుమాన్. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనిపించుకునే స్థాయికి ఎదిగింది హనుమాన్ మూవీ. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… నా సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, సెన్సార్ కూడా ఆపాలని చూస్తున్నారు అనే మాట చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో హనుమాన్ టీమ్ పై సింపతీ క్రియేట్ అవుతుంది. ఎవరెంత ఆపాలని చూసినా హనుమాన్ సినిమాని సంక్రాంతి రేస్ లో నిలబెడతాను, నా సినిమాలో కంటెంట్ ఉంది అంటూ ప్రశాంత్ వర్మ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అయితే ఒకవేళ హనుమాన్ సినిమా జనవరి 12నే రిలీజ్ అయినా కూడా థియేటర్స్ దొరికే పరిస్థితి కనిపించట్లేదు.
హనుమాన్ రిలీజయ్యే రోజే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతోంది. ఇదే సంక్రాంతి సీజన్ లో ఇతర స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. గుంటూరు కారం సినిమాతో పాటు, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాల నైజాం రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. రవితేజ ఈగల్ సినిమా నైజాం రైట్స్ ని ఏషియన్ సొంతం చేసుకుంది. దాదాపు థియేటర్స్ కి హోల్డ్ చేస్తున్న దిల్ రాజు, ఏషియన్ ని దాటుకోని మైత్రీ మూవీ మేకర్స్ హనుమాన్ సినిమాని ఎంతవరకూ రిలీజ్ చేయగలరు అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికి ఉన్న క్లారిటీ ప్రకారం అయితే హనుమాన్ సినిమాకి నైజాం ప్రాంతంలో మరీ ముఖ్యం హైదరాబాద్ సిటీలో సింగల్ స్క్రీన్ థియేటర్స్ దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఇష్యూని మైత్రీ మూవీ మేకర్స్ ఎలా అడ్రెస్ చేస్తారు అనేది చూడాలి.