ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళయాళ ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజా. ఆయన తొలి చిత్రం ‘హనుమాన్ జంక్షన్’. ఈ చిత్రం విడుదలై డిసెంబర్ 21కి అక్షరాలా ఇరవై ఏళ్ళు పూర్తయింది. ప్రముఖ నిర్మాత, ఎడిటర్ మోహన్ పెద్దకొడుకు రాజా. రీమేక్ మూవీస్ ను తెరకెక్కించడంలో మేటి ఎడిటర్ మోహన్ అని అందరికీ తెలుసు. ఆయన చిత్రాలన్నిటికీ మోహన్ సతీమణి ఎమ్.వి.లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు. ‘హనుమాన్ జంక్షన్’ చిత్రానికి కూడా ఎడిటర్ మోహన్ సమర్పకులు కాగా, లక్ష్మి నిర్మాత. తల్లిదండ్రులు ఇద్దరూ సినీగోయర్స్. దాంతో రాజాకు, ఆయన తమ్ముడు రవి ఇద్దరికీ తొలి నుంచీ సినిమా అంటే ప్రాణమనే చెప్పాలి. రాజా దర్శకునిగా రాణించారు. రవి హీరోగా తమిళనాట విజయపథంలో పయనిస్తున్నారు. తన పెద్దకొడుకు రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎడిటర్ మోహన్ అందించిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రానికి మళయాళ సినిమా ‘తెన్ కాశిపట్టణం’ ఆధారం
కథ విషయానికి వస్తే- అనాథలయిన కృష్ణ, దాసు చిన్నతనం నుంచీ మంచి స్నేహితులు. సమాజంలో ధనవంతులు అనిపించుకోవాలన్నదే వారి ధ్యేయం. ఈ క్రమంలో హనుమాన్ జంక్షన్ లో కె.డి. అండ్ కో నెలకొల్పి, సక్సెస్ రూటులో సాగుతుంటారు. దాసుకు దేవి అనే చెల్లెలు ఉంటుంది. ఆమెను కృష్ణ సైతం సొంత చెల్లెలిలాగే చూసుకుంటూఉంటాడు. ముగ్గురూ కలసి జీవిస్తూంటారు. దేవిని ఆమె క్లాస్ మేట్ అజాతశత్రు ప్రేమిస్తాడు. తన అన్నయ్యలకు నచ్చినవాణ్ణే పెళ్ళాడుతానంటుంది దేవి. ఆమె అన్నల మనసు గెలవడానికి శత్రు, వారి కెడి.అండ్ కోలో మేనేజర్ గా చేరతాడు. కృష్ణకు అతని చిన్ననాటి ప్రేయసి స్నేహ అంటే ఇష్టం. కేడీ అండ్ కో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంగీత అనే గాయని పాల్గొంటుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల హనుమాన్ జంక్షన్ లోనే ఆమె ఉండిపోవలసి వస్తుంది. అప్పుడే ఓ అనుకోని సంఘటన జరుగుతుంది. ఆమెను దాని నుండి బయట పడేసి, తన ప్రేయసిని దక్కించుకోవడానికి శత్రు నానా తంటాలు పడతాడు. ప్రతీసారి కృష్ణ, దాసుతో చీవాట్లు తింటూఉంటాడు శత్రు. సంగీత కారణంగా కృష్ణ,దాసు మధ్య పొరపొచ్చాలు వస్తాయి. వాటినీ సద్దు మణిగేలా చేయడానికి శత్రు పాలు పాట్లు పడతాడు. చివరకు ఎవరికి నచ్చిన వారిని వారు పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో అర్జున్, జగపతిబాబు, వేణు, స్నేహ, లయ, విజయలక్ష్మి, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, కోవై సరళ, ఆలీ, వెన్నిరాడై నిర్మల, ఎల్బీ శ్రీరామ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రాళ్ళపల్లి, రవి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సురేశ్ పీటర్స్ సంగీతం సమకూర్చగా, వేటూరి, చంద్రబోస్ పాటలు రాశారు. “కోనసీమల్లో ఓ కోయిల…”, “ఒక చిన్ని లేడికూన…”, “గోల్ మాల్ గోల్ మాల్…”, “ఓ ప్రేమా ప్రేమా…”, “ఖుషీ ఖుషీగా…” పాటలు అలరించాయి.
ఈ సినిమా 2001 డిసెంబర్ 21న విడుదలై విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రంతో పాటే విడుదలైన జూ.యన్టీఆర్ హీరోగా నటించిన ‘సుబ్బు’ అంతగా అలరించలేకపోయింది. దాంతో ‘హనుమాన్ జంక్షన్’ భలేగా జయకేతనం ఎగురవేసింది. దర్శకుడు రాజాకు ‘హనుమాన్ జంక్షన్’ తొలి చిత్రం, అదీ రీమేక్, చక్కగా తెరకెక్కించి విజయం సాధించారు. ఈ సినిమా తరువాత తమిళ చిత్రాలతోనే రాజా సాగారు. దాదాపు 20 ఏళ్ళ తరువాత ఇప్పుడు తెలుగులో చిరంజీవి వంటి మేటి హీరోతో ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కిస్తున్నారు రాజా. ఈ సినిమా కూడా రీమేక్ కావడం వల్ల రాజా తనదైన పంథాలో ఆ చిత్రాన్ని రూపొందిస్తారని ఆశించవచ్చు.