బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. వడోదర రైల్వే స్టేషన్‌లో 2017లో జరిగిన ‘రయీస్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు షారూఖ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. తనపై ఉన్న క్రిమినల్ కేసును, దిగువ కోర్టు తనపై జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ షారుఖ్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని ఆలకించారు జస్టిస్ నిఖిల్ కరీల్. అప్పట్లో షారుఖ్ పై దాఖలైన ఈ క్రిమినల్ కేసును గుజరాత్ హైకోర్టు ఏప్రిల్ 27 బుధవారం నాడు రద్దు చేసింది. ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి ఖాన్‌పై ఫిర్యాదు చేశారని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. షారుఖ్ ఖాన్ జనాలను ఉత్తేజపరచడానికే ఆలా చేసి ఉండొచ్చు. అంతేకానీ అది నిర్లక్ష్యంతో చేసిన పని కాదు. షారుఖ్ తన సినిమా ప్రమోషన్ గురించే అలా చేశాడు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అర్థమవుతోంది అంటూ న్యాయమూర్తి స్టార్ హీరోకు అనుగుణంగా తుది తీర్పును ఇచ్చారు.
Read Also : RGV : అజయ్ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్… వర్మ షాకింగ్ కామెంట్స్
2017 జనవరి 23న షారుఖ్ తన సినిమా ‘రయీస్’ ప్రచారానికి వడోదర వచ్చారు. అక్కడ ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొనడంతో, జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఫర్హీద్ ఖాన్ పఠాన్ అనే స్థానిక రాజకీయ నాయకుడు ఈ తొక్కిసలాట సందర్భంగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. దీంతో జితేంద్ర సోలంకి అనే వ్యక్తి షారుఖ్ పై ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించడానికి, సూపర్ స్టార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో షారుఖ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ వడోదర కోర్టును ఆశ్రయించారు. సోలంకి తన ఫిర్యాదులో షారుఖ్ అభిమానులను ఉత్సాహపరచడానికి స్మైలీ బాల్స్ ను విసరడం, టీషర్ట్స్ విసరడం నేరపూరిత నిర్లక్ష్యమని ఆరోపించారు. అదే ఈ తొక్కిసలాటకు, అందులో ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైందని అన్నారు. కానీ తాజాగా ఈ కేసును కోర్టు కొట్టేసింది.