అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు దీన్ని జనం ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు తహతహ లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ ఏజెంట్
మూవీలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో చిత్ర బృందం మంతనాలు జరుపుతోందట. ఉపేంద్ర నటించిన కన్నడ చిత్రాలు తెలుగులో డబ్ అవడంతో పాటు, ఉపేంద్ర స్ట్రయిట్ తెలుగు సినిమాలలోనూ హీరోగా నటించాడు. అంతేకాకుండా అవకాశం చిక్కాలే కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడానికి ఉపేంద్ర సిద్ధంగా ఉన్నాడు. అలా ఆ మధ్య త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ మూవీ సన్నాఫ్ సత్యమూర్తి
లో ఉపేంద్ర కీలక పాత్ర పోషించాడు. అలానే ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న గని
చిత్రంలోనూ ఉపేంద్ర ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఏజెంట్
మూవీకి వక్కంతం వంశీ కథను అందించాడు.అందులోని విలన్ పాత్రను ఉపేంద్ర పోషిస్తే బాగుంటుందని మెజారిటీ యూనిట్ సభ్యులు అభిప్రాయ పడుతున్నారని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో సైరా
వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఈ తాజా ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడని అంటున్నారు.