UNEXPECTED – SAFED SACH: దేశాన్ని కుదిపేసిన డెహ్రాడూన్ బస్సు ఘటనపై సినిమా

Un Expected News

Un Expected News

ఒక చిన్న అపార్థం.. ఇంట్లో ఎవరో కావాలని పెట్టిన ఓ ప్రేమలేఖ.. ఆవేశంలో ఇల్లు వదిలి రాత్రి బస్సు ఎక్కిన ఓ టీనేజ్ అమ్మాయి.. ఆ తర్వాత పాడుబడిన బస్సు, ప్రభుత్వ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ బాలిక! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసిన డెహ్రాడూన్ ఐఎస్‌బిటి (ISBT) అత్యాచార ఘటనను ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఓ భారీ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో తన కెమెరా పనితనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి.. ఈ సంచలన కథాంశంతోనే ఏకంగా బాలీవుడ్‌లోకి దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్’ (UNEXPECTED – SAFED SACH) అనే ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలై నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పోస్టర్ చూస్తుంటేనే ఇదొక మామూలు క్రైమ్ స్టోరీ కాదని అర్థమైపోతోంది. తలపాగా, దట్టమైన గడ్డంతో పవర్‌ఫుల్ సిక్కు పోలీస్ అధికారి (ఎస్ఎస్పి భరత్ సింగ్) గెటప్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇక ‘మర్డర్ 2’ ఫేమ్ ప్రశాంత్ నారాయణన్ తన గంభీరమైన, ఇంటెన్స్ చూపులతో కథలోని మిస్టరీని మరింత పెంచేశారు. మరోవైపు సంప్రదాయ ఎర్రటి తలపాగాలో కనిపిస్తున్న ఎస్తేర్ అనిల్ ఈ పోస్టర్‌కు బలమైన ఎమోషనల్ టచ్ ఇచ్చారు. వీటన్నింటికీ తోడు క్రైమ్ సీన్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ది ఫేట్‌ఫుల్ నైట్’ (The Fateful Night) అని రాసి ఉన్న పోలీసు టేప్.. ఆ రాత్రి జరిగిన దారుణాన్ని, దాని వెనుక ఉన్న చీకటి నిజాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా ‘గరుడవేగ’ అంజి స్వయంగా నిర్వహిస్తున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది రొటీన్ క్రైమ్ థ్రిల్లర్‌లా కాకుండా, మహిళల భద్రత, సామాజిక బాధ్యతపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించేలా ఉంటుందని స్పష్టం చేశారు. యశ్ వీరా ఫిల్మ్స్ సమర్పణలో ప్యారేలాల్ గుండెచా (సోజాత్ రోడ్ వాలా) నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సమాజానికి ఓ బలమైన సందేశాన్ని ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని నిర్మాత వెల్లడించారు. ఇక పోలీస్ అధికారిగా నటిస్తున్న సంజయ్ కపూర్ సైతం ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఎమోషనల్‌గా స్పందించారు. “మహిళలపై జరిగే నేరాలు కేవలం వార్తాపత్రికల్లో హెడ్‌లైన్స్‌గా మిగిలిపోకూడదు. అవి సమాజంగా మన బాధ్యతను గుర్తుచేస్తాయి. సమగ్ర దర్యాప్తు, సత్యాన్వేషణ ఎంత ముఖ్యమో నా పాత్ర ద్వారా చూపించబోతున్నాం” అని అన్నారు. నిజ జీవిత ఘటనలను తెరకెక్కించేటప్పుడు నటులుగా తమపై మరింత బాధ్యత ఉంటుందని, ఈ కథ లేవనెత్తే ప్రశ్నలు ప్రేక్షకులను కచ్చితంగా ఆలోచింపజేస్తాయని ప్రశాంత్ నారాయణన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కథ దేశంలోని ప్రతి మూలకు చేరాలనే ఉద్దేశంతో మేకర్స్ ఏకంగా 9 భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గర్వాలీ, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. పృథ్వీ రాజ్, తంబి రామయ్య, సంజయ్ సింగ్, గంజా కరుప్పు వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాయ్ సంగీతం అందిస్తున్నారు. 2027లో థియేటర్లలోకి రానున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. బాలీవుడ్‌లో ‘గరుడవేగ’ అంజికి ఎలాంటి సంచలన విజయాన్ని అందిస్తుందో చూడాలి!