Gaanza Shankar: విరూపాక్ష సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలను అనౌన్స్ చేయకుండా కథలను ఆచితూచి ఎంచుకొని.. హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించాడు. గాంజా శంకర్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తేజ్ సరసన పూజా హెగ్డే నటిస్తుందని టాక్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో గాంజా శంకర్ గా తేజ్ మాస్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి రెండు కారణాలు అని అంటున్నారు. ఒకటి.. ముందుగా ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ వేరు.. ఇప్పుడు అవుతున్న బడ్జెట్ వేరు కావడంతో.. అంత బడ్జెట్ ను నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా నిలిపివేశారని చెప్పుకోస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ ను బట్టి సినిమా బడ్జెట్ ఉంటుంది. అందుకే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అయ్యిందని టాక్. ఇక ఇది కాకుండా రెండో కారణం వచ్చి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తన రెమ్యూనిరేషన్ పెంచాడని అంటున్నారు. విరూపాక్ష హిట్ తో తన మార్కెట్ పెరగడంతో తేజ్.. తన తదుపరి సినిమా నుంచి రూ. 15 కోట్లు డిమాండ్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.