Frist Day First Show Trailer:జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు కె. అనుదీప్. ప్రస్తుతం శివకార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమా తీస్తున్న అనుదీప్ మరోపక్క రచయితగా కూడా మారాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాకు అనుదీప్ కథను అందించాడు. శ్రీజా ఎంటర్ టైన్ మెంట్స్ మిత్ర విందా మూవీస్ బ్యానర్ లపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఏడిద నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి, సంచిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని.. తన ప్రేమను కాపాడుకోవడానికి పడిన కష్టమే సినిమా కథగా తెలుస్తోంది. ఈ కథలో హీరో పేరు శ్రీను.. అతడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ సినిమా ఏదైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చచ్చిపోతాను అనేంత అభిమానం. అలాంటి శ్రీను కు లయ అనే అమ్మాయి నచ్చుతోంది. ఎప్పుడు మాట్లాడని ఆ అమ్మాయి ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఇప్పించమని శ్రీనును అడుగుతోంది. ఇక ఆ సినిమా టికెట్స్ కోసం హీరో పడిన కష్టాలే సినిమా. మధ్యలో ఆ టికెట్స్ కోసం కొట్టుకొనే ఫ్యాన్స్, వారిని అదుపు చేయడానికి వచ్చే పోలీసులు వీటన్నింటిని వినోదాత్మకంగా చూపించారు. నటీనటులు కొత్తవారైనా పాత్రలకు ప్రాణం పోసినట్లు కనిపిస్తున్నారు. జాతిరత్నాలు లానే ఈ సినిమాలో కూడా పంచ్ డైలాగ్స్ తో నింపేశాడు అనుదీప్. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు చిత్ర బృందం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మరో జాతి రత్నాలు అవుతుందేమో చూడాలి.