Four Updates Releasing From Prabhas Films On His 43rd Birthday: ఏవైనా ఈవెంట్లు, మరీ ముఖ్యంగా హీరోల పుట్టినరోజులు వచ్చినప్పుడు.. వారి సినిమాల నుంచి అప్డేట్స్ కావాలని అభిమానులు కోరుకుంటారు. మేకర్స్ కూడా ఫ్యాన్స్ కోరిక తీర్చేందుకు, ఆయా సందర్భాల్ని పురస్కరించుకొని క్రేజీ అప్డేట్స్ ఇస్తుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంతు వచ్చింది. రేపు ఈ రెబెల్ స్టార్ 43వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే.. ప్రభాస్ చేస్తోన్న చిత్రాల నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తే, ఈ శుభ సందర్భాన్ని మరింత గ్రాండ్‌గా ఎంజాయ్ చేయొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాళ్ల కోరికలు తీర్చేందుకు కూడా మేకర్స్ సన్నద్ధమయ్యారని తెలుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ప్రభాస్ చేస్తోన్న నాలుగు చిత్రాల నుంచి అప్డేట్స్ రానున్నట్టు సమాచారం. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.
ఆల్రెడీ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు అధికారికంగా వెల్లడించాడు. ట్విటర్ మాధ్యమంగా ఓ అభిమాని ‘అన్నా, మేము గుర్తున్నామా?’ అని ప్రశ్నిస్తే.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న అప్డేట్ ఇవ్వబోతున్నామని తెలిపాడు. అయితే.. అది ప్రభాస్ ఫస్ట్ లుక్కా? ప్రీ లుక్కా? లేక ఏదైనా ఇతర అప్డేటా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా.. ఏదో ఒకటి రిలీజ్ చేయబోతున్నామన్న విషయం చెప్పి, ఫ్యాన్స్‌లో ఆనందమైతే నింపాడు. ఇక ఆదిపురుష్ చిత్రబృందం కూడా, ప్రభాస్‌కి సంబంధించి ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అటు.. మారుతి కూడా ప్రభాస్‌తో చేయబోతున్న సినిమాకి సంబంధించి అనౌన్స్‌మెంట్ చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. మరోవైపు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. మరి, అది పోస్టరా? లేక టీజరా? అనేది చూడాలి.
ఇలా.. ప్రభాస్ చిత్రాల నుంచి అతని పుట్టినరోజు సందర్భంగా డిఫరెంట్ అప్డేట్స్ రాబోతున్నాయని సమాచారం. దీంతోపాటు.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బిల్లా’ చిత్రం కూడా రేపు రీ-రిలీజ్ కాబోతోంది. అయితే.. ప్రభాస్ మాత్రం ఈసారి తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాడు. తన పెదనాన్న కృష్ణంరాజు ఇటీవల మృతి చెందడమే అందుకు కారణం.