“మీ పేరు?”
“బొబ్బిలిపులి”
“అసలు పేరు?”
“బొబ్బిలిపులి”
– కోర్టు హాల్ లో శ్రీదేవి ప్రశ్న, యన్టీఆర్ సమాధానం… ఇలా సాగుతున్న సీన్ లో ఏముందో, ఆమె ఏమి అడుగుతోందో, ఆయన ఏం చెబుతున్నారో తెలియకుండా ‘బొబ్బిలిపులి’ ఆడే థియేటర్లలో ఆ డైలాగ్స్ కు కేకలు మారుమోగి పోయేవి. అసలు యన్టీఆర్ కోర్టులోకి ఎంట్రీ ఇచ్చే టప్పటి నుంచీ ఆయన నోట వెలువడిన ప్రతీ డైలాగ్ కు జనం చప్పట్లు, కేరింతలు, ఈలలు సాగుతూనే ఉన్నాయి. దాదాపు 12 నిమిషాల పాటు సాగే ఆ కోర్టు సీన్ తోనే ‘బొబ్బిలిపులి’ సినిమా ముగుస్తుంది. అప్పట్లో అలా స్టోరీని ‘ఎండ్’ చేయడం ఓ పెద్ద సాహసం. అందునా నటరత్న యన్టీఆర్ లాంటి మహానటుడు, సూపర్ స్టార్ నటించిన సినిమాలో ప్రేక్షకుల ఊహకే ముగింపును వదిలేస్తూ తీయడమన్నది అంత సులువైన అంశం కాదు. కానీ, ఆ ప్రయోగాన్ని చేసి అదరహో అనిపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. అయినప్పటికీ కనీవినీ ఎరుగని కలెక్షన్ల హిస్టరీతో ‘బొబ్బిలిపులి’ సంచలన విజయం సాధించింది. ‘బొబ్బిలిపులి’ 1982 జూలై 9న విడుదలైన సమయంలో అప్పటికి ఎన్నడూ ఊహించని విధంగా ప్రతీ కేంద్రంలోనూ సగానికి పైగా థియేటర్లలో ఈ సినిమానే విడుదల కావడం విశేషం! ఇప్పటిలా అన్ని థియేటర్లలో స్టార్ హీరోస్ నటించిన భారీ చిత్రాలను విడుదల చేసే సంప్రదాయం అప్పట్లో లేదు. పైగా యన్టీఆర్ నటించిన మరో చిత్రం ‘జస్టిస్ చౌదరి’ అప్పటికే విజయకేతనం ఎగురవేస్తూ అనేక థియేటర్లలో సాగుతోంది. ఈ రెండు చిత్రాల మధ్య కేవలం 42 రోజుల వ్యవధే ఉండడం ఈ తరం వారికి అబ్బురం కలిగించవచ్చు. అలా రెండు సినిమాలూ ఘనవిజయం సాధించి, 1982వ సంవత్సరానికి పెద్ద ఊపునిచ్చాయి. ఆ రెండిటా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే కథానాయకుడు! ఆ రెండింటిలోనూ ‘బొబ్బిలిపులి’ది పై చేయి కావడం విశేషం!
‘బొబ్బిలిపులి’ కథ ఏమిటంటే – అహర్నిశలూ సరిహద్దుల్లో ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణకుతూ దేశరక్షణ కోసం పాటు పడే వీరసైనికుల వల్లే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. దేశరక్షణ కోసం శత్రుమూకలను తునాతునకలు చేస్తూ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం సాగించే వీరసైనికులు ఎందరో. అలా కన్నతల్లి మరణించినా, దేశమాత రక్షణ కోసమే పోరాడిన చక్రధర్ అనే మేజర్ స్వస్థలానికి వస్తాడు. సమాజంలోని కుళ్ళు, కుతంత్రాలు చూసి వాటిపై పోరాటం సాగిస్తాడు. దేశానికి అసలైన శత్రువులు దేశంలోనే ఉన్నారని, వారిని అంతమొందించడానికి చక్రధర్ ‘బొబ్బిలిపులి’గా మారతాడు. తన చెల్లెలిని, ఆమె భర్తను దారుణంగా చంపేసిన వారిని మట్టు పెడతాడు. దేశానికి ద్రోహం చేస్తున్న కన్నతండ్రిని కూడా చంపేస్తాడు. ఆ నేరాలకు చక్రధర్ కోర్టు బోను ఎక్కుతాడు. చక్రధర్ ప్రేయసి విజయనే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆమె ప్రశ్నలకు, చక్రధర్ ఇచ్చే సమాధానాలు అన్నీ ఆయన నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు చేస్తాయి. ఆ కోర్టు చక్రధర్ కు ఉరిశిక్ష విధిస్తుంది. పై కోర్టుకు పోతే ఏమవుతుందని న్యాయమూర్తిని ప్రశ్నిస్తాడు చక్రధర్. ‘శిక్ష తగ్గించవచ్చు, లేదా ఇదే శిక్షను అమలు చేయవచ్చునని’ న్యాయమూర్తి సమాధానమిస్తారు. “కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్…” అంటూ చక్రధర్ ప్రశ్నిస్తాడు. శత్రుమూకలను చంపినందుకు తనకు ఇచ్చిన ‘పరమవీరచక్ర’ అవార్డు, నిజానికి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న వారిని చంపినందుకు ఇప్పుడు ఇస్తే బాగుండేదనీ చక్రధర్ అభిప్రాయపడతాడు. కోర్టు ఈ తీర్పుపై చక్రధర్ పై కోర్టుకు పోవచ్చునని సెలవిస్తుంది. ‘బొబ్బిలిపులి’లా చక్రధర్ మళ్ళీ కనిపించడంతో సినిమా ముగుస్తుంది.
ఈ చిత్రంలో శ్రీదేవి, జయచిత్ర, సత్యనారాయణ, జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి, పుష్పలత, అంబిక, మురళీమోహన్, ప్రసాద్ బాబు, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, రాజా, మిక్కిలినేని, ముక్కామల, రాజనాల, ధూళిపాల, రావి కొండలరావు నటించారు. ఐటమ్ సాంగ్ “ఓ అప్పారావో…ఓ సుబ్బారావో…” పాటలో విజయలలిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని, సుబాషిణి నర్తించారు.
విజయమాధవీ కంబైన్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి సమర్పణలో వడ్డే రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు. ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతం సమకూర్చారు. ఇందులో “సంభవం అది నీకే సంభవం…”, “జననీ జన్మభూమిశ్చ…”, “తెల్లా తెల్లని చీరలోన…”, “ఓ సుబ్బారావో… ఓ అప్పారావో…” అంటూ సాగే పాటలు దాసరి కలం నుండి జాలువారాయి. వేటూరి రాసిన “ఎడ్డమంటె తెడ్డమంటె…”, “అది ఒకటో నంబర్ బస్…” పాటలూ ఉన్నాయి. ఈ సినిమా పాటలు విడుదలకు ముందే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయి, అప్పట్లో ఓ రికార్డు నెలకొల్పింది.
నటరత్న యన్టీఆర్, దర్శకరత్న దాసరి కాంబినేషన్ లో కేవలం ఐదు చిత్రాలు మాత్రమే రూపొందాయి. అన్నిటా అన్యాయాన్ని ఎదిరించే కథానాయకుడు కనిపిస్తాడు. వీరి తొలి చిత్రం ‘మనుషులంతా ఒక్కటే’ అందులోనే దాసరి స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న భారతదేశంలోని రాజుల దురహంకారాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. దానిని ఎదిరించి, స్వేచ్ఛాభారతంలో అందరూ ఒక్కటే అన్న భావనతో ఎలా మెలగాలో తెరకెక్కించారు దాసరి. ఇక ‘సర్కస్ రాముడు’లో సామాజిక స్పృహ అంతగా కనిపించదు కానీ, ‘విశ్వరూపం’లో సమాజంలోని అరాచకంపై సెటైర్లు వేశారు దాసరి. ‘సర్దార్ పాపారాయుడు’లో స్వరాజ్య పోరాట యోధుని దేశభక్తిని, కొందరు దుర్మార్గుల కారణంగా దేశద్రోహిగా ముద్రపడిన పాపారాయుడు ఎలా స్వతంత్ర భారతంలో పోరాటం సాగించాడు అన్న గాథను జనరంజకంగా తెరకెక్కించారు దాసరి. ఈ నేపథ్యంలో నటరత్న, దర్శకరత్న కాంబినేషన్ లో వచ్చిన ‘బొబ్బిలిపులి’పై తొలి నుంచీ భారీ అంచనాలున్నాయి.
‘బొబ్బిలిపులి’ చిత్రంలో యన్టీఆర్ నటిస్తున్న సమయానికే ఆయన రాజకీయ ప్రవేశం గురించిన ఊహాగానాలు సాగుతున్నాయి. తరువాత 1982 మార్చి 29న యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీని ప్రకటించడంతో అప్పటి దాకా ఆయనను నటునిగా అభిమానించిన రాజకీయ నాయకులు విమర్శనాస్ట్రాలు సంధించడం మొదలు పెట్టారు. ఆ పై ‘బొబ్బిలిపులి’ చిత్రానికి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్(ఐ) పార్టీ నేతలు ఇబ్బందుల పాలు చేశారు. ఈ సినిమాపై సెన్సార్ అస్త్రం ప్రయోగించారు. ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకొనే ప్రయత్నం సాగింది. అయితే అభిమానులు ‘బొబ్బిలిపులి’ సినిమా విడుదల కోసం నిరాహారదీక్షలూ చేశారు. అలా ఓ సినిమా విడుదల కోసం జనం నిరాహారదీక్ష చేయడం అన్నది అదే మొదటి సారి. ‘బొబ్బిలిపులి’లో అధికంగా ఘర్షణలు, రక్తపాతం ఉందని, ఎట్టకేలకు కొన్ని కట్స్ తో ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పట్లో స్టార్ హీరోస్ సినిమాలకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తే, సదరు చిత్రాలు జనాన్ని ఆకర్షించలేవనే సెంటిమెంట్ ఉండేది. అన్ని సెంటిమెంట్లను పటాపంచలు చేస్తూ ‘బొబ్బిలిపులి’ అనూహ్య విజయం సాధించింది.
భారీ వసూళ్ళు అన్నవి యన్టీఆర్ సినిమాలకే సాధ్యమయ్యేవి. ‘లవకుశ’ అందుకు పెద్ద నిదర్శనం. ఆ తరువాత యన్టీఆర్ ‘అగ్గి-పిడుగు’తోనే సినిమా మొదటివారం వసూళ్ళు ప్రకటించే సంప్రదాయం మొదలయింది. ఆ పై ‘అగ్గిబరాటా, గండికోట రహస్యం, అన్నదమ్ముల అనుబంధం’ వంటి చిత్రాలకు మొదటి రోజు వసూళ్ళు కూడా ప్రకటించారు. ఆ తరువాత అలా సాగిన చిత్రాలలో ‘సర్దార్ పాపారాయుడు’, ‘ఎంకి-నాయుడుబావ’ ఉన్నాయి. అప్పటి దాకా మొదటి రోజు వసూళ్ళలో రికార్డుగా నిలచిన ‘సర్దార్ పాపారాయుడు’ కంటే ‘బొబ్బిలిపులి’ దాదాపు మూడు రెట్లు వసూలు చేయడం విశేషం! ఇక మొదటి వారం ఈ చిత్రం రూ.72 లక్షలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. టోటల్ రన్ లో రూ.3.5 కోట్లు వసూలు చేసిందీ చిత్రం. యన్టీఆర్ ‘అడవిరాముడు’ తరువాత ఆ స్థాయి వసూళ్ళు చూసిన సినిమాగా ‘బొబ్బిలిపులి’ నిలచింది. 39 కేంద్రాలలో శతదినోత్సవం, రెండు కేంద్రాలలో డైరెక్టుగా రజతోత్సవం జరుపుకున్న ‘బొబ్బిలిపులి’ హైదరాబాద్ లో స్వర్ణోత్సవం చూసింది. 1993లో ‘బొబ్బిలిపులి’ హైదరాబాద్ లో మరోమారు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం!