టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు అతని కుమారుడు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై ఫైనాన్షియర్ శ్రవణ్ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. గోపించంద్ మలినేనితో శ్రీనివాస్ సినిమా ఉంటుందని చెప్పి తనవద్ద రూ.85 లక్షలు తీసుకున్నారని అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని శ్రవణ్ గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణ హాని కూడా ఉందని తెలిపాడు. ఇక ఈ కేసుఫై బెల్లంకొండ సురేష్ ఫైర్ అయ్యిన సంగతి తెలిసిందే.. శ్రవణ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని, నా పిల్లలు నా ప్రాణం.. వారి పేరు తీసుకొచ్చి శ్రవణ్ చాలా పెద్ద తప్పు చేశాడని, అతడి వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వివాదం రసవత్తరంగా సాగుతున్న సమయంలో శ్రవణ్ ఈ కేసును విరమించుకుంటున్నట్లు తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ కేసు పై శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ” కొంతమంది పెద్దల సమక్షంలో సెటిల్ మెంట్ అయ్యింది. బెల్లంకొండ సురేష్ నా అకౌంట్లు క్లియర్ చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఇక ఈ వివాదంలోకి ఎటువంటి సంబంధం లేని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పేరును తీసుకొచ్చినందుకు క్షమించమని అడుగుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శ్రవణ్ వ్యాఖ్యలతో ఈ వివాదం ముగిసినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే శ్రవణ్ కి డబ్బులు ముట్టాయా ..? లేక వెనుక ఏదైనా రాజకీయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
