హిందీ సినిమా కథలు తెలుగులోనూ, తెలుగు సినిమా కథలు హిందీలోనూ రీమేక్ అయిన సందర్భాలు బోలెడున్నాయి. ఇప్పుడే కాదు, భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లోనే ఈ పంథా సాగాంది. యన్టీఆర్ హీరోగా తెలుగులో రూపొందిన ‘కథానాయకుడు’ చిత్రం హిందీలో రాజేశ్ ఖన్నాతో ‘అప్నా దేశ్’గా రీమేక్ అయి విజయం సాధించింది. రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన కొన్ని చిత్రాల ఆధారంగా తెలుగులో యన్టీఆర్ హీరోగా సినిమాలు తెరకెక్కి విజయం సాధించాయి. రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన ‘అప్నా దేశ్’ 1972 మే 26న విడుదలై విజయఢంకా మోగించింది.
‘అప్నా దేశ్’ కథ విషయానికి వస్తే – ఆకాశ్ నీతి, నిజాయితీని నమ్ముకొని సాగుతూ ఉంటాడు. అతనికి ముంబై మునిసిపల్ కార్పోరేషన్ లో క్లర్క్ గా ఉద్యోగం వస్తుంది. అన్నావదినలు, వారి ఇద్దరు పిల్లలతో కలసి ఆకాశ్ జీవిస్తూ ఉంటాడు. బొంబాయి నగరంలో ధర్మదాస్ పెద్దమనిషిగా చెలామణీ అవుతూ ఉంటాడు. కానీ, చేసేదంతా అధర్మమే. ఆకాశ్ అన్న దీనానాథ్, ధర్మదాస్ వద్ద నమ్మినబంటుగా పనిచేస్తూ ఉంటాడు. మునిసిపల్ కార్పోరేషన్ లో తన పనులు సాగడానికి ఆకాశ్ కు డబ్బు ఆశ చూపిస్తాడు ధర్మదాస్. కానీ, అందుకు ఆకాశ్ లొంగడు. తరువాత వారిద్దరి మధ్య పలు పరిణామాలు జరుగుతాయి. కొబ్బరి బోండాలు అమ్మే చందా, ఆకాశ్ కు పరిచయం అవుతుంది. ధర్మదాస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ్మునితో దీనానాథ్ గొడవ పడతాడు. దాంతో ఇంట్లోంచి బయటకు పోతాడు ఆకాశ్. చందా ఉండే ఏరియాలోనే నివసిస్తాడు ఆకాశ్. అతనంటే చందా ప్రత్యేక అభిమానం చూపిస్తుంది. ఆకాశ్ సైతం చందా ప్రేమను అర్థం చేసుకుంటాడు. తరువాత ధర్మదాస్ పైనే కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచి మేయర్ అవుతాడు ఆకాశ్. ఎలాగైనా ఆకాశ్ ను చిక్కుల్లో పెట్టాలని ధర్మదాస్ ఓ పథకం ప్రకారం కార్పోరేషన్ డబ్బును డ్రా చేసి, దానిని ఆకాశ్ అన్న దీనానాథ్ తో వేరే చోటకు పంపే ప్రయత్నం చేస్తాడు. మార్గం మధ్యలో దీనానాథ్ ను చంపేసి, ఆ డబ్బు తీసుకు వస్తే, ఆ నేరాన్ని దీనానాథ్, ఆకాశ్ పైకి నెట్టేయ వచ్చునని పథకం వేస్తాడు ధర్మదాస్. అయితే ఈ విషయం తెలుసుకున్న దీనానాథ్ బ్యాంక్ లోని మొత్తం డబ్బు డ్రా చేసి, ఓ చోట దాచేస్తాడు. అతణ్ణి పట్టుకొని ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పమని ధర్మదాస్ చిత్రహింసలు పెడతాడు. ఇక కార్పోరేషన్ డబ్బును ఆకాశ్ వాడుకున్నాడని అతణ్ణి పదవిలో నుండి తొలగిపోయేలా చేస్తారు. ఆకాశ్, అలీబాబా అనే వ్యక్తి సాయంతో మారువేషం వేసుకొని, ధర్మదాస్ అతని మిత్రులను మోసం చేస్తాడు. ఆ సమయంలో వారు చేసిన తప్పులను వారి నోటనే చెప్పించి, చివరకు అన్నను విడిపించి, ఆ డబ్బును ప్రభుత్వానికి అప్ప చెబుతాడు ఆకాశ్. నేరస్థులైన ధర్మదాస్, అతని మిత్రులు జైలు పాలవుతారు. ఆకాశ్, చందా, దీనానాథ్, భార్యాపిల్లలు కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
రాజేశ్ ఖన్నా, ముంతాజ్, ఓం ప్రకాశ్, జగదీప్, కన్హయలాల్, మదన్ పు రి, మన్మోహన్ క్రిష్ణ, సత్యేంద్ర కపూర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మన తెలుగురచయిత ముళ్ళపూడి వెంకటరమణ కథ ఆధారం కాగా, ఇందర్ రాజ్ ఆనంద్, రాజ్ బల్ దేవ్ రాజ్ చిత్ర రచన చేశారు. ఏవీ సుబ్రహ్మణ్యం, టి. గోవిందరాజన్ తమ వీనస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి జంబు దర్శకత్వం వహించారు. ఆర్.డి.బర్మన్ స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి ఆనంద్ బక్షి పాటలు రాశారు. ఇందులోని “సునో చందా సునో తారా…”, “రోనా కభి నహి రోనా…”, “కజ్రా లగాకే…”, “దునియా మే లోగోం కో…”, “యే బాబూ లే లో నా నారియల్…”, “ఆజా ఓ మేరే రాజా…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రంలో “రోనా కభి నహీ రోనా…” పాటలో ప్రధాన గాత్రం కిశోర్ కుమార్ ది కాగా, విజేత పండిట్, సంధ్య పండిట్ బాలలకు కోరస్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకులు జతిన్ – లలిత్ కు వీరిద్దరూ అక్కలు. ఇక ఇందులోని “ఆజా ఓ మేరే రాజా…” పాటకు స్ఫూర్తి జపాన్, కొరియా దేశాల్లో విశేషంగా ఆదరణ పొందిన “బ్లూ లైట్ యొకోహమా…” అనే గీతం. ఆ పాట బాణీల్లోనే ఆర్డీ బర్మన్ ‘ఆజా ఓ మేరీ రాజా…’ పాటను కంపోజ్ చేశారు.
ముళ్ళపూడి రాసిన ‘కథానాయకుడు’ చిత్రం తెలుగునాట ఘనవిజయం సాధించడమే కాదు, యన్టీఆర్ చిత్రాలలో బంగారునంది సొంతం చేసుకున్న సినిమాగా నిలచింది. ఈ చిత్రాన్ని తమిళంలో యమ్జీఆర్ హీరోగా ‘నమ్ నాడ్’ పేరుతో రీమేక్ చేయగా అక్కడా ఘనవిజయం సాధించింది. హిందీలోనూ ‘అప్నాదేశ్’ విజయాన్ని మూటకట్టుకుంది. రాజేశ్ ఖన్నా, ముంతాజ్ కాంబోలో వచ్చిన హిట్ మూవీస్ లో ‘అప్నా దేశ్’ కూడా చోటు దక్కించుకుంది.