దాదాపు పదేళ్ళ క్రితం విశాల్, ఆర్య హీరోలుగా దర్శకుడు బాలా ‘అవన్ – ఇవన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నటుడిగా విశాల్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. ఇంతకాలానికి మళ్ళీ వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ శంకర్ ‘ఎనిమి’ చిత్రాన్ని రూపొందించాడు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా వచ్చిన రజనీకాంత్ ‘పెద్దన్న’తో పోటీ పడింది.
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పారి రాజన్ (ప్రకాశ్ రాజ్) పదేళ్ళ తన కొడుకు రాజీవ్ (ఆర్య) ను ఊటీలో చదివిస్తుంటాడు. బాల్యం నుండి క్రమశిక్షణతో అతన్ని పెంచాలనుకుంటాడు. తమ ఇంటి పక్కనే ఉండే మరో పిల్లాడు సూర్య (విశాల్) నూ చేరదీసి ఇద్దరికీ కలిపి రకరకాల అంశాలలో శిక్షణ ఇప్పిస్తుంటాడు. అంతలోనే రాజన్ హత్యకు గురవుతాడు. ఈ హత్యకు భయపడిన సూర్య తండ్రి తన కొడుకును తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళకు సింగపూర్ లో సెటిల్ అయిన సూర్య తండ్రి అక్కడో డిపార్ట్ మెంట్ స్టోర్స్ పెట్టుకుంటాడు. సూర్య అక్కడి తెలుగు వారికి తన చేతనైనంత సాయం చేస్తుంటాడు. పోలీస్ అధికారి కొడుకైన రాజీవ్ మాత్రం క్రిమినల్ గా తయారవుతాడు. ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్స్ పక్షాన రకరకాల హత్యలు చేసే రాజీవ్, ఓ అసెన్ మెంట్ నిమిత్తం సింగపూర్ కు వస్తాడు. సింగపూర్ పర్యటనకు వచ్చిన భారత కేంద్రమంత్రిని రాజీవ్ చంపబోతే, సూర్య కాపాడతాడు. ఒకప్పుడు బాల్య స్నేహితులు అయిన వీరిద్దరూ ఊహించని విధంగా తిరిగి కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? ఈ కలయిక వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పింది? అనేది మిగతా కథ.
విశాల్ గత కొంతకాలంగా యాక్షన్ సినిమాలకు పరిమితం అయిపోయాడు. ఈ యేడాది ప్రారంభంలోనూ సైబర్ క్రైమ్ నేపథ్యంలో ‘చక్ర’ అనే యాక్షన్ మూవీ చేశాడు. ఇక ఆర్య భిన్నమైన కథా చిత్రాలు చేస్తున్నాడు కానీ ఆశించిన స్థాయి కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘టెడ్డీ’ నిరాశపర్చినా, ‘సార్పట్టా’ చిత్రం బాక్సర్ గా ఆర్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. విశాల్ కు మంచి మిత్రుడు అయిన ఆర్య ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించడం విశేషం. అయితే ఆనంద్ శంకర్ ఎంచుకున్న కథలో దమ్ము లేకపోవడం, దాన్ని తెరకెక్కించడంలో అతను విఫలం కావడంతో విశాల్, ఆర్య పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. సినిమా ప్రారంభం ఆసక్తికరంగానే మొదలైంది. ఇద్దరు యువకులను ప్రకాశ్ రాజ్ ట్రైన్ చేయడం, వారికి ఫోటోగ్రాఫిక్ మెమోరీకి సంబంధించిన టిప్స్ ఇవ్వడం వరకూ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆ సీన్స్ ను ఎస్టాబ్లీష్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
భారత్, చైనా వ్యాపార లావాలేవీలు, అంతర్జాతీయ వ్యాపార సంస్థల కుట్రలు, అందులో భాగంగా భారత కేంద్ర మంత్రిని హత్య చేయాలనుకోవడం… ఇవన్నీ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. కథలో పసలేకపోవడంతో సన్నివేశాలూ పండలేదు. ఇక హీరో, హీరోయిన్ అనే కాన్సెప్టే ఇందులో లేదు. మృణాళిని రవి పాత్ర ఎందుకు పెట్టారో అర్థం కాదు. అలానే మమతా మోహన్ దాస్ పాత్రలోనూ డెప్త్ లేదు. ఇటు విశాల్ పక్కన, అటు ఆర్య పక్కన రెండు ఫిమేల్ క్యారెక్టర్స్ ఉండాలని వీరిద్దరినీ పెట్టినట్టు ఉంది. ప్రకాశ్ రాజ్ పాత్ర ముగింపుకు ఓ ట్విస్ట్ పెట్టినా, అదేమీ కథకు పెద్దంతగా ఉపయోగపడలేదు. మొత్తం మీద సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ పరమ కంగాళీగా సాగిపోయింది.
నటీనటుల విషయానికి వస్తే విశాల్, ఆర్య ఇద్దరూ మంచి నటులే. యాక్షన్స్ సీన్స్ లోనూ తమ సత్తాను చాటగలిగే వాళ్ళే కానీ క్లయిమాక్స్ ఫైట్ తప్ప మిగిలిన వేవీ ఇందులో ఆకట్టుకునేలా లేవు. విశాల్ తెర మీద ఎందుకో చాలా ఆడ్ గా కనిపించాడు. ఆర్య కొంతలో కొంత ఫర్వాలేదు. చాలా కాలం తర్వాత మమతా మోహన్ దాస్ బిగ్ స్క్రీన్ పై కనిపించింది. కానీ ఆమె క్యారెక్టరైజేషన్ అంత కన్వెన్సింగ్ గా లేదు. అలానే మృణాళిని రవి వచ్చిన అవకాశం వినియోగించుకోవాలని చేసినట్టుంది తప్పితే, ఆమె పాత్రకూ పెద్దంత ప్రాధాన్యం లేదు. ప్రకాశ్ రాజ్ తెర మీద కనిపించేది ప్రారంభంలో కొద్దిసేపే! విశాల్ తండ్రిగా తంబి రామయ్య చక్కగా చేశారు. ఇక విశాల్ స్నేహితుడిగా కరుణాకరన్, భారతీయ మంత్రిగా మాళవిక అవినాశ్, సింగపూర్ పోలీస్ అధికారిగా మరిముత్తు నటించారు. ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది, తమన్ స్వరాలు పెద్దంత ఆకట్టుకునేలా లేవు, శామ్ సి. ఆర్. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. దర్శకుడు ఆనంద్ శంకర్ తీసిన చిత్రాలలో ‘అరిమ నంబి’ మాత్రమే కాస్తంత చెప్పుకోదగ్గది. ఆ తర్వాత వచ్చిన ‘ఇరుముగన్, నోటా’ చిత్రాలు భారీ పరాజయాలను పొందాయి. మరి ఆ ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా విశాల్, ఆర్య… ఆనంద్ శంకర్ ను ఎలా విశ్వసించారో తెలియదు. దానికి తగిన మూల్యాన్ని వారే కాదు, వారిని నమ్మి థియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకులూ చెల్లించాల్సి వస్తుంది.
ప్లస్ పాయింట్స్:
విశాల్, ఆర్య కాంబో!
యాక్షన్ సీన్స్
నేపథ్య సంగీతం
మైనెస్ పాయింట్స్:
తాడుబొంగరం లేని కథ
ఆసక్తి కలిగించని కథనం
రేటింగ్: 2.25 /5
ట్యాగ్ లైన్: ప్రేక్షకులకు ఎనిమి!