Varun Dhawan: ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ తాజాగా ఇప్పుడు హిందీ సినిమా ‘భేడియా’ తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘తోడేలు’ను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతోంది. ఈ నెల 25న మూవీ రిలీజ్ అవుతోంది. ఆ సందర్భంగా పబ్లిసిటీలో వేగం పెంచారు నిర్మాతలు. వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన ఈ మూవీలో ఇప్పటికే ‘తుమ్కేశ్వరి’ అనే గీతం విడుదలై శ్రోతల నుండి ఆదరణ అందుకుంది. తాజాగా ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందించగా, ఈ పాటను అమితాబ్ భట్టాచార్యతో కలిసి యనమండ్ర రామకృష్ణ రాశారు. ఈ ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ సైతం వ్యూవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.
2018 లో వచ్చిన ‘స్త్రీ’, 2021 లో వచ్చిన ‘రూహి’ తరువాత, దినేష్ విజన్ హారర్-కామెడీ జానర్ లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘భేడియా’. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఇది 2డీ, 3డీ వర్షన్స్ లో విడుదల కాబోతోంది. ఇటీవలే ‘కాంతార’ను పంపిణీ చేసి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అల్లు అరవింద్ విడుదల చేస్తున్న ‘తోడేలు’ మూవీ మీద కూడా సహజంగానే అంచనాలు పెరిగాయి.